Mahaa Daily Exclusive

  అక్షరం ముక్క రాని కవి…..

Share

  • అక్షరం ముక్క రాని కవి
  • బడి మొహం చూడకపోయినా
  • తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ

మహా : అందెశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు. బడి మెుహం కూడా చూడలేదు. ఆయనకు అక్షరం ముక్క కూడా రాదు. కానీ.. ఆయన బాల్యం అంతా పల్లెటూరి ప్రకృతితో, పశువుల మందతోనే గడిచింది. పైరగాలిలో, పక్షుల గుంపులో, కొండవాగులో, మట్టివాసనలో ఆయన మనసు కవిత్వం అల్లింది. ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా, బడిగా మారింది. ఆయన పాటలు, కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు.. తెలంగాణ నేల ఆత్మను పలికించే సహజసిద్ధమైన ఆశువు కవిత్వం.

అందెశ్రీ తాపీ పని నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్లినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్‌ మహారాజ్‌ ఆయన పాటలు విన్నారు. ఆశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పే ఆయన ప్రతిభను గుర్తించి, చేరదీసి ఆయన పేరును అందె శ్రీగా మార్చారు. ఇక్కడి నుంచే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ తర్వాత తన పాటల ద్వారా, ప్రజల కష్టాలను, ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.

అందెశ్రీ రాసిన ‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’ పాట ఎంతో మంది మనసులను కదిలించింది. అలాగే, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా’ లాంటి అనేక జానపద, విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర మహోన్నతమైనది. ఆయన ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా, తెలంగాణ పది జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ గీతాన్ని అందెశ్రీనే రచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటించింది. నిరక్షరాస్యుడైన అందెశ్రీ అపారమైన సాహిత్య సేవకు గుర్తింపుగా.. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఏనాడూ బడికి వెళ్లకపోయినా.. అక్షరం ముక్క రాకపోయినా.. అందె శ్రీ తెలంగాణ సాహిత్యానికి చుక్కానిగా నిలిచారు.

Latest