- బీహార్ పీఠం ఎన్డీయేదే!
- తేల్చిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్
- మహాగట్బంధన్కు నిరాశ తప్పదంటున్న సర్వేలు
- పనిచేయని ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ ఫ్యాక్టర్
- ఓటెత్తిన బిహార్.. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయి పోలింగ్
బీహార్, మహా: ఉత్కంఠగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్బంధన్ కూటముల మధ్య కొంత పోరు సాగినప్పటికీ… విజయానికి అవసరమైన స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని పేర్కొన్నాయి. తద్వారా ఎన్డీయే కూటమి బీహార్లో అధికారాన్ని కాపాడుకుంటుందని తెలిపాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కూడా అంచనా వేశాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… అక్కడ అధికారం చేపట్టేందుకు 122 స్థానాల్లో విజయం సాధించడం అవసరం. పలు ఎగ్జిట్ పోల్స్ ఇలా అంచనా వేశాయి.
జేవీసీ ఎన్డీయే – 135-150 మహాఘట్బంధన్ – 88-103 జన్ సురాజ్ – 0-1 ఇతరులు – 3-6
పీపుల్స్ పల్స్ ఎన్డీయే – 133-159 మహాఘట్బంధన్ – 75-101 జన్ సురాజ్ – 0-5 ఇతరులు – 2-8
చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీయే – 130-138 మహాఘట్బంధన్ – 100-108 జన్ సురాజ్ -0-0 ఇతరులు- 0-5
పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీయే – 133-148 మహాఘట్బంధన్ – 87-102 జన్ సురాజ్ – 0-2 ఇతరులు- 3-6
డీవీ రీసెర్చ్ ఎన్డీయే – 137-152 మహాఘట్బంధన్ – 83-98 జన్ సురాజ్ – 2-4 ఇతరులు -0-0
మ్యాట్రీజ్ ఎన్డీయే – 147-167 మహాఘట్బంధన్ – 70-90 జన్ సురాజ్ – 0-2 ఇతరులు – 2-8
బీహార్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ నిర్వహించగా… తొలి విడతలో ఈ నెల 6న 121 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. నేడు చివరి విడతలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలిదశలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైంది. అయితే రెండో విడతలో అంతకుమించి పోలింగ్ శాతం నమోదైంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం… బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో దాదాపు 68.48 శాతం ఓటింగ్ నమోదైంది. ఇందుకు సంబందించి తుది గణంకాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేపట్టనున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఫస్ట్ టైం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. 20 జిల్లాల పరిధిలోని 122 సీట్లకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ విడతలో 3.7 కోట్ల మంది ఓటర్లకు గాను.. సాయంత్రం 5 గంటల సమయానికి రికార్డు స్థాయిలో 67.14శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి విడతలోనూ 65.9 శాతం భారీ పోలింగ్ రికార్డైన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. 2000లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 62.57శాతం నమోదు కాగా.. ఇప్పటివరకు ఇదే గరిష్ఠం. లోక్సభ ఎన్నికల విషయానికొస్తే.. 1998లో అత్యధికంగా 64.6శాతం పోలింగ్ నమోదైంది.








