- ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్.
- ఆరుగురు మావోయిస్టుల మృతి.
- బీజాపూర్ జంగిళ్లలో బలగాల మెరుపు ఆపరేషన్.
- మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.
- అగ్రనేతలు బుచ్చన్న, ఊర్మిల మృతి.
- బస్తర్ రేంజ్లో క్షీణించిన మావోయిస్టుల ప్రభావం.
- ఐజీ సుందర్రాజ్ వెల్లడి.
ఖమ్మం బ్యూరో, మహా.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం మంగళవారం భీకర యుద్ధరంగాన్ని తలపించింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ప్రారంభమైన ఎదురుకాల్పులు రాత్రి వరకు కొనసాగగా, ఈ ఘర్షణలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మద్దేడు ఏరియా కమిటీ ఇంచార్జ్ బుచ్చన్నతో పాటు అతని భార్య ఊర్మిల వంటి అగ్రనేతలు ఉన్నట్లు భద్రతా వర్గాలు ధృవీకరించాయి. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్స్ తదితర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ రేంజ్ అంతటా మావోయిస్టు కార్యకలాపాలను అణచివేయడంలో ఈ విజయం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
*నిఘా ఆధారిత ఆపరేషన్‌తో వేట*
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై భద్రతా నిఘా విభాగం నుంచి సమాచారం అందింది. ఈ మేరకు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సంయుక్త బృందాలు ఉదయం నుంచే దట్టమైన అడవుల్లో ఆపరేషన్ ప్రారంభించాయి. ఉదయం 10 గంటల సమయంలో దాగి ఉన్న మావోయిస్టులు బలగాలపై ముందుగా కాల్పులు ప్రారంభించగా, భద్రతా సిబ్బంది సమర్థవంతంగా ప్రతిదాడి చేశారు. ఈ ఎదురుకాల్పులు మధ్యాహ్నం వరకు కొనసాగాయి.
*మావోయిస్టు అగ్రనేతలకు భారీ ఎదురుదెబ్బ*
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు చెందిన అగ్రనేత బుచ్చన్న, అతని భార్య ఊర్మిల మృతి చెందడం భద్రతా బలగాలకు పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు. బుచ్చన్న బీజాపూర్ ప్రాంతంలో మద్దేడు ఏరియా కమిటీ ఇంచార్జ్‌గా కీలకపాత్ర పోషించేవాడు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడంలో అతనికి ఉన్న అనుభవం దృష్ట్యా, ఈ దంపతుల మృతి ఆ సంస్థకు మానసికంగా, వ్యూహాత్మకంగా తీరని నష్టం కలిగించినట్లు భావిస్తున్నారు. మిగతా మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
** ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం**
ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్స్, .303 రైఫిల్స్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. మావోయిస్టుల యూనిఫాంలు, కమ్యూనికేషన్ పరికరాలు, విప్లవ సాహిత్యం పుస్తకాలు కూడా లభించాయని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఇది మావోయిస్టుల దాచిన శిబిరం అని, సమీప ప్రాంతాలపై దాడుల కోసం ఇక్కడి నుంచే ప్రణాళికలు రచించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
*క్షీణిస్తున్న మావోయిస్టు ఉనికి*
బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం మావోయిస్టు సంస్థ తీవ్రంగా బలహీనపడింది. నాయకత్వం లేకుండా, సమన్వయం లేకుండా గుంపులుగా విరిగిపోయింది. వారి కార్యకలాపాలు ఇప్పుడు అబూజ్‌మఢ్ అడవుల్లోని కొన్ని సరిహద్దు గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యాయి అని విశ్లేషించారు. నిఘా ఆధారిత ఆపరేషన్లు ఫలప్రదమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజయంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు తగ్గి, శాంతి పునరుద్ధరణకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు.
** అడవుల్లో బలగాల జల్లెడ**
ఎన్కౌంటర్ సమయంలో కొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లోకి పారిపోయినట్లు సమాచారం. వీరిని పట్టుకునేందుకు అదనపు బలగాలను మోహరించి అడవులను జల్లెడ పడుతున్నారు. పొరుగు జిల్లాల్లోకి వారిని ప్రవేశించకుండా రహదారుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. బస్తర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో కూడా ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా వర్గాలు తెలిపాయి.
*పెరిగిన ప్రజా మద్దతు*
మావోయిస్టు భయానికి గురైన అటవీ ప్రాంత ప్రజలు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారని స్థానిక గ్రామస్థులు తెలిపారు. ఇటీవల నెలల్లో భద్రతా బలగాలు గ్రామాల్లో సైనిక శిబిరాలు ఏర్పాటు చేయడం, రహదారి సదుపాయాలు మెరుగుపరచడం వంటి చర్యలతో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది. ఈ ఎన్కౌంటర్ ఘటన మావోయిస్టు ప్రభావాన్ని మరింత తగ్గించడంలో కీలకమవుతుందని ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.








