- సామూహిక విష ప్రయోగ కుట్ర
- దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో రెసిన్ విషాన్ని కలిపి దుశ్చర్య
- ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు
హైదరాబాద్, మహా: అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు అత్యంత ప్రమాదకరమైన ‘రిసిన్’ అనే విషపదార్థాన్ని తయారు చేసి, దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున విషప్రయోగం చేయాలని కుట్ర పన్నినట్టు విచారణలో బయటపడింది. గుజరాత్ ఏటీఎస్ సమాచారం ప్రకారం.. మొయినుద్దీన్ ఇప్పటికే రెసిన్ తయారీకి అవసరమైన క్యాస్టర్ ఆయిల్ వంటి రసాయనాలను సేకరించాడు. దేవాలయాలు, వాటర్ ట్యాంకులు, ప్రజలు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఈ విషాన్ని కలిపి, సామూహికంగా ప్రజలను చంపే ప్రయత్నం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, దీనికి సంబంధించిన ఆయుధాలు, పిస్టల్స్, బుల్లెట్లు, రసాయన పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ వెల్లడించింది. ఈ కేసులో మొయినుద్దీన్‌తో పాటు మరో నలుగురిని కూడా గుజరాత్ ఏటీఎస్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అందులో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలతో ఈ గుంపుకు లింకులు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మొయినుద్దీన్ చైనాలో వైద్య విద్య పూర్తిచేసి భారత్‌కు తిరిగి వచ్చి, తన నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఈ కుట్ర దేశవ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశ్యంతో రూపుదిద్దుకున్నట్లు విచారణ అధికారులు చెబుతున్నారు. విషప్రయోగం ద్వారా సామూహిక హత్యలు చేయాలన్న ఉగ్రగూళ్ల దురుద్దేశం దేశ భద్రతా సంస్థలను అలర్ట్ చేసింది. ప్రస్తుతం మొయినుద్దీన్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తదితర కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.








