Mahaa Daily Exclusive

  రూల్స్ బ్రేక్ చేసే వాహనాలపై కఠిన చర్యలు:మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

Share

  • రూల్స్ బ్రేక్ చేసే వాహనాలపై కఠిన చర్యలు
  • అదనపు పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేసేలా చర్యలు
  • నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్
  • మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

హైదరాబాద్, మహా: రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించింది. ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయడానికి సచివాలయంలో రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా ఆ రోజు చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతాలపై ఆయా బృందాలకు ఉదయం ఆరు గంటలకు రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం తెలపనున్నారు. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు మినరల్ ట్రాన్స్పోర్ట్ లో సాండ్, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్, చలానాలపై ఈ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేయనున్నాయి. వాటికి అదనపు పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ లను వేధింపులకు గురి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. గతవారం చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తీసుకున్న చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమీషనర్ ఇలంబర్తి, జేటీసీయూ రమేష్, చంద్రశేఖర్, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest