- కేసు విత్ డ్రా..
- మంత్రి సురేఖ, నాగార్జున వివాదానికి ఎండ్ కార్డ్
- మంత్రి క్షమాపణ చెప్పడంతో అక్కినేని కీలక నిర్ణయం
- డిఫమేషన్ కేసులో కొండా సురేఖకు బిగ్ రిలీఫ్
హైదరాబాద్, మహా: మంత్రి కొండా సురేఖకు బిగ్ రిలీఫ్ దక్కింది. మంత్రి, సినీ హీరో అక్కినేని నాగార్జున మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం సుఖాంతమైంది. మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో హీరో నాగార్జున సానుకూలంగా స్పందించి వివాదానికి తెరదించారు. ఆ కేసును గురువారం విత్ డ్రా చేసుకున్నారు. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున గతంలో నాంపల్లి కోర్టులో పరువు నష్టం (డిఫమేషన్) దావా వేశారు. అయితే ఇటీవల మంత్రి సురేఖ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ తెలియజేయడంతో, నాగార్జున గురువారం కోర్టులోని ఆ డిఫమేషన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు. దీంతో అక్కినేని ఫ్యామిలీకి, మంత్రి సురేఖకు మధ్య నెలకొన్న ఈ వివాదం పూర్తిగా ముగిసినట్లయింది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇవే..
కేటీఆర్, తనను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడంతో తాను భావోద్వేగానికి గురై నాగార్జున కుటుంబం మీద విమర్శలు చేయాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ‘‘ ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనే ఒక ఆలోచనతో నేను బేశరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది.’’ అని అన్నారు.







