- టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే కడతా
- సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని విద్యార్థులకు కిషన్ రెడ్డి కానుక
- కలెక్టర్ హరిచందనకు కేంద్ర మంత్రి లేఖ
హైదరాబాద్, మహా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్ష ఫీజును తానే కడతానని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఎంపీగా తనకు వచ్చే వేతనం నుంచి భరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అందించిన అంత్యోదయ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంశంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు రాసిన లేఖను ఆయన ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఏ ఖాతాలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనే విషయాన్ని తనకు తెలియజేయాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే, పాఠశాలల వారీగా పదో తరగతి విద్యార్థుల వివరాలు, ఎంత మొత్తాన్ని జమ చేయాలనే వివరాలను కూడా తెలియజేయాలన్నారు.







