- 5 బిలియన్ డాలర్ల దావా వేస్తా
- సారీ వద్దు.. ఆ దావా చెల్లించాల్సిందే
- బీబీసీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో హెచ్చరిక
ఇంటర్నెట్ డెస్క్, మహా: అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చడంతో బీబీసీ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రసంగాన్ని మార్చినందుకుగాను ఆ సంస్థపై 5 బిలియన్ డాలర్ల దావా వేస్తానని ట్రంప్ మీడియా సంస్థను హెచ్చరించారు. కాగా బీబీసీ తన చర్యలతో ట్రంప్ పరువుకు భంగం కలిగించినందుకు పరిహారంగా బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆయన న్యాయబృందం ఇప్పటికే మీడియా సంస్థకు లేఖ రాసింది.
పరిహారాన్ని ఇచ్చేందుకు నిరాకరణ..
దీనిపై క్షమాపణలు చెప్పిన మీడియా సంస్థ ట్రంప్ డిమాండు చేసిన బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆ సంస్థపై దావా తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్చరించారు. వచ్చే వారంలో బీబీసీపై 1 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు కోర్టులో దావా వేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమస్య గురించి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో చర్చించనున్నట్లు తెలిపారు. బీబీసీ సంస్థ చింతిస్తున్నట్లు ఛైర్మన్ సమీర్ షా శ్వేతసౌధానికి తిరిగి వ్యక్తిగత లేఖ పంపారు. అయితే ట్రంప్ డిమాండు చేసిన బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.







