- పత్రికలు సానుకూల వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- నేతలు దారి తప్పుతున్నట్లయితే సరిదిద్దాలి
- సోషల్ మీడియాలో జవాబుదారీతనం పెరగాలి
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన
- వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ పుస్తకాలు’ అనుభవాలు-జ్ఞాపకాలు’, ‘అప్పుడు-ఇప్పుడు’, ఆవిష్కరణ
హైదరాబాద్, మహా : వికసిత్ భారత్ నిర్మాణం లో పత్రికలు, పాత్రికేయులు ప్రముఖ పాత్ర పోషించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. ఓటర్ల జాబితాను పరిశీలించి వాటిలో మార్పులు చేర్పులు సూచించాల్సింది పార్టీల కార్యకర్తలేనని స్పష్టం చేశారు.హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రచురించిన రెండు విశిష్టమైన పుస్తకాలు’ అనుభవాలు-జ్ఞాపకాలు’, ‘అప్పుడు-ఇప్పుడు’, లను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ప్రజలను ఏకం చేయడానికి, వారిలో జాతీయ స్ఫూర్తిని నింపడానికి, బ్రిటీష్ దురాగతాలను ప్రశ్నించడానికి ఏకైక ఆయుధం మన పత్రికలే, ఎన్నో పత్రికలు కేవలం కాగితపు ముక్కలు కావు; అవి అగ్ని కణాలుగా పని చేశాయి. పాత్రికేయులు దేశ నిర్మాణంలో మళ్లీ ప్రముఖ పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. వికసిత భారత్ దిశగా మన దేశ ప్రయాణంలో అత్యంత కీలకమైన పాత్రను పత్రికా రంగం పోషించాలి. సానుకూల సమాచారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే విమర్శలు చేయాలి. రాజకీయ పార్టీలు, రాజకీయ నేతల పోకడ సరిగా లేకుంటే సరిదిద్దాల్సిన బాధ్యతను పత్రికలు, పాత్రికేయులు తీసుకోవాలి.” అని చెప్పారు.
పత్రికలు, రాజకీయ పార్టీలు సమాజ హితమే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
“రాజకీయ పార్టీలకు సిద్ధాంత నిబద్ధత అవసరం. ఏ పార్టీ కార్యకర్తలైనా క్షేత్రస్థాయిలో కష్టపడి, బాధ్యతతో పని చేయాలి. క్షేత్రస్థాయిలో వారు చురుకుగా ఉండాలి. ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితాను ఇంటింటికి తిరిగి పరిశీలించి మార్పులు, చేర్పులు సూచించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల కార్యకర్తలపైనే ఉంది. అవసరమైతే మూడు నాలుగు సార్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలి.” అని వెంకయ్య నాయుడు సూచించారు. “నేను కార్యకర్తగా ఉన్నప్పుడు ఇలాగే ఇంటింటికి మూడు నాలుగు సార్లు తిరిగి పరిశీలించేవాడిని. ఇప్పుడు పార్టీలు అంత శ్రద్ధగా ఈ పని చేస్తున్నట్టు కనిపించడం లేదు.” అని అన్నారు.
పత్రికల్లో వాడే భాష, నేతలు మాట్లాడే భాష సంస్కారయుతంగా ఉండాలన్నారు. అసెంబ్లీలో, పార్లమెంటులో మాట్లాడేటప్పుడు భాష హుందాగా ఉండాలన్నారు. సత్యాన్ని తెలియజేసేదే జర్నలిజమని, వార్తలను వార్తలుగా మాత్రమే ఇవ్వాలని, అందులో అభిప్రాయాలను కలపకూడదని స్పష్టం చేశారు. తక్షణమే సమాచారాన్ని ప్రజల వద్దకు చేరడానికి సోషల్ మీడియా మంచి వేదికే అని, అయితే ఆ వేదికను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో జవాబుతారీతనం ఉండేలా సరిదిద్దాలని స్పష్టం చేశారు. వయోధిక పాత్రికేయులు తమ అనుభవాలను ‘అనుభవాలు జ్ఞాపకాలు’ పుస్తకంలో గుదిగుచ్చగా, ఆనాటి మరో ప్రముఖ పాత్రికేయుడు జి.కృష్ణ ( జీకే) రాసిన వ్యాసాలను ‘అప్పుడు-ఇప్పుడు’, పుస్తక రూపంలో తీసుకురావడం మంచి విషయమని అభినందించారు. పత్రికారంగంలో మార్పులను, మేధావుల అనుభవాలను రికార్డు చేసిన ఈ కృషి అభినందనీయమని, నేటితరం పాత్రికేయులు, మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు అని చెప్పారు. ఈ రెండు పుస్తకాలు గొప్ప రిఫరెన్సులుగా నిలుస్తాయన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశించిన తొలినాళ్లలో నాటి తరం పాత్రికేయులతో మాట్లాడటం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని వెంకయ్య నాయుడు చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వెంకటనారాయణ, జె.వి.లక్ష్మణ్, దాసు కేశవరావు, పి.ఎ.రామారావు, రాజశుక, కె.రామచంద్రమూర్తి, ఉడయవర్లు తదితరులు పాల్గొన్నారు.








