- వరల్డ్ బ్యాంక్ డబ్బుతో బిహార్ లో గెలుపు
- రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లించారు
- ప్రజల డబ్బు ద్వారా.. ప్రజల ఓట్లు కొనేందుకే ఇదంతా
- జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు
బిహార్, మహా: ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ ఎన్డీయే కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను బిహార్ ఎన్నికల సమయంలో ఎన్డీయే ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేయాలి..
ఎన్నికలకు ముందు బిహార్‌లోని మహిళల ఖాతాల్లో వేసిన రూ.10 వేలు ఈ నిధుల నుంచి మళ్లించినవేనన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు నీతీశ్ ప్రభుత్వం ఓట్లను కొనుగోలు చేయడానికి దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఈ చర్యల ద్వారా ఎన్డీయే నేతలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.






