కుల, మతాల మధ్య బండి సంజయ్ చిచ్చు
కేంద్రమంత్రి అని మర్చిపోయి మాట్లాడుతున్నారు
నవీన్ యాదవ్ ఒక కులం, ఒకే మతం ఓట్లతో గెలవలేదు
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, మహా: కేంద్ర మంత్రి అయినప్పటికీ బండి సంజయ్ తన హోదాను మరచిపోయి మాట్లాడటం అలవాటుగా చేసుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘హిందువులంతా బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది’ అని ఆయన మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఆదివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతైందని, అసెంబ్లీ ఎన్నికల కంటే ఉపఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తగ్గాయని ఎంపీ చామల ప్రశ్నించారు. “బీజేపీ లోపాయికారిగా బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా?” అని ప్రశ్నించి, దీనిపై బండి సంజయ్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు.
మోడీ, అమిత్ షాలపై ఒత్తిడి తెచ్చి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కేవలం ఒక కులం లేదా మతం ఓట్లతో గెలవలేదని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో బీసీ బిడ్డకు టిక్కెట్ ఇవ్వడం వల్లే ప్రజలు ఆదరించారని అన్నారు. బండి సంజయ్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం మానేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం పదే పదే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారని, కాబట్టి మోడీ, అమిత్ షాలపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపులార్, మూసీ పునరుజ్జీవానికి నిధులు తేవాలని కేంద్ర మంత్రులను (కిషన్ రెడ్డి, బండి సంజయ్) డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి చొరవ చూపాలని అన్నారు.








