Mahaa Daily Exclusive

  బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

Share

  • మా తడాఖా చూపిస్తాం
  • బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తామంటే చూస్తూ ఊరుకోం
  • మాకు భిక్షం వద్దు.. రాజ్యాంగబద్ధంగా ఇవ్వండి
  • పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే యుద్ధం తప్పదు
  • బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: పార్టీ పరంగా రిజర్వేషన్లు వద్దని, చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో ఆదివారం జరిగిన ‘బీసీ రిజర్వేషన్ల న్యాయ సాధన దీక్ష’కు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వం వహించారు. విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ, న్యాయవాదులు సహా 60కిపైగా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తామంటే చూస్తూ ఊరుకోమని, మా తడాఖా చూపిస్తామని ఫైర్ అయ్యారు. పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్లడం తప్పించుకునే ఉపాయమని, పార్టీ పరంగా ఇవ్వొద్దని గతంలో చెప్పినట్లు గుర్తు చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే చాలా వివాదాలు వస్తాయని తెలిపారు. మాకు భిక్షం వద్దు.. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

42 శాతం కాదు, 52 శాతం రిజర్వేషన్లూ ఇవ్వొచ్చు..
దీక్షకు అధ్యక్షత వహించిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రామాణిక పద్ధతులు పాటిస్తే 42 శాతం మాత్రమే కాదు, 52 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేయొచ్చని పేర్కొన్నారు. ‘డేటా బలంగా ఉంటే చట్టపరమైన అవరోధాలు తగ్గుతాయి’ అని వెల్లడించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ పెంపును అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. దీక్ష సమయంలో ఇందిరా పార్క్ బీసీ రిజర్వేషన్ల నినాదాలతో మార్మోగింది. వేలాది మంది బీసీ సంఘాల కార్యకర్తలు తరలిరావటంతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసింది. బీసీల జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిష్టాత్మక వేదికల్లో తగిన శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు.

Latest