Mahaa Daily Exclusive

  తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్’ను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తాం: రాష్ట్ర డిప్యూటీ సీం భట్టి విక్రమార్క వెల్లడి

Share

  • అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్
  • గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం
  • తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్’ను  ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తాం
  • రాష్ట్ర డిప్యూటీ సీం భట్టి విక్రమార్క వెల్లడి
  • అధికారులతో కలిసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలన

హైదరాబాద్, మహా: “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సాధించిన విజయాలను చాటి చెప్పడమే కాకుండా, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అనే దీర్ఘకాలిక దృష్టి ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్’ను ప్రపంచ దేశాలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలోని 100 ఎకరాల విశాలమైన ఓపెన్ ల్యాండ్‌తో పాటు హైటెక్స్, గచ్చిబౌలి, దుండిగల్ తదితర ప్రాంతాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికలను పరిశీలించారు. అనంతరం మీడియాతో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. మొదటి ఏడాది ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ద్వారా సాధించిన ఘన విజయాలను రాష్ట్ర ప్రజల ముందుంచామని అన్నారు. రెండవ ఏడాది మరింత వేగంగా అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచస్థాయి గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన, ప్రపంచంలోనే పేరుగాంచిన నగరమన్నారు. అద్భుతమైన వాతావరణం, నైపుణ్యం గల యువత, తక్కువ ఖర్చుతో అత్యుత్తమ మానవ వనరులు ఉన్నాయని, ఇవన్నీ హైదరాబాద్‌లో ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఈ అవకాశాన్ని ప్రపంచ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, శశాంక, నర్సింహారెడ్డి, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
============================

Latest