Mahaa Daily Exclusive

  బీహార్ ఓటమికి బాధ్యత నాదే … జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్

Share

మహా

బీహార్ ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా కృషి చేసినా ఓటమి పాలైందని, అయితే ఆ బాధ్యత నూటికి నూరు శాతం తనదేనని జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల తర్వాత జరిగిన తొలి మీడియా సమావేశంలో మంగళవారం తెలిపారు. మా పార్టీ ఓడిపోయినా, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తుందని, వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. “నిజాయితీగా ప్రయత్నించాం కానీ విఫలమయ్యాం, దానికి పూర్తి బాధ్యత నాదే. ఎదురుదెబ్బ తగిలింది కానీ తప్పులు దిద్దుకుని, మమ్మల్ని మేము బలోపేతం చేసుకుంటాం, బలంగా తిరిగి వస్తాం, వెనకడుగు వేసేది లేదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ‘రూ.10,000కు ఓటర్లు అమ్ముడు పోయినట్టు జనం చెబుతున్నారు. అది నిజం కాదు. ప్రజలు తమ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును అమ్ముకోలేదు. ఈ చర్చ ఇలా సాగుతూనే ఉంటుంది. కొందరు ఎన్నికల కమిషన్ తప్పిదాలకు పాల్పడిందని చెబుతున్నారు. వాళ్ల వాదన వాళ్లది. కానీ, ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం 60,000 నుంచి 62,000 మందికి రూ.10,000 ఇచ్చారు. రూ.2 లక్షల రుణాలు ఇస్తామని వాగ్దానం చేసారు. ఎన్డీయే అధికారంలోకి వస్తేనే లోన్లు వస్తాయని విధి నిర్వహణలో ఉన్న అధికారులు ప్రచారం చేశారు. జీవికా దీదీలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు’ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Latest