- బీజేపీ నాయకులను డీఫేమ్ చేసే కుట్ర
- ఫేక్ న్యూస్‌పై బీజేపీ ‘సోషల్ మీడియా వార్’ మొదలు పెడతాం
- తప్పుడు ప్రచారం చేస్తే డిఫమేషన్ కేసు తప్పదు
- కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు ఫైర్
హైదరాబాద్, మహా: సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులను అప్రతిష్టపాలు చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు తీవ్ర ఆరోపణలు చేశారు. లీగల్ సెల్, సోషల్ మీడియా బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ పెరుగుతున్నందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ అకౌంట్లు సృష్టించి, తప్పుడు వార్తలతో పార్టీని బ్లేమ్ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులను డీమోరలైజ్ చేయడానికి కొంతమంది పనిగట్టుకొని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారని, ఇకపై సోషల్ మీడియా వార్ మొదలెడతామని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మంచి కార్యక్రమాల కోసం ఉపయోగించాలని, విచ్చలవిడిగా పార్టీలపై దుష్ప్రచారం చేయడానికి కాదని ఆయన కార్యకర్తలకు సూచించారు.
ఒక పత్రికకు లీగల్ నోటీసులు ఇచ్చాం..
ఈ సందర్భంగా రామచంద్ర రావు కీలక హెచ్చరిక చేశారు. పార్టీ నాయకులను బ్లేమ్ చేసేవారికి ఏ ఒక్క పార్టీ నేత అయినా మద్దతుగా నిలబడ్డా, ఆ పోస్టులను రీట్వీట్ చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అలాంటి వారిని ఇమ్మీడియెట్‌గా నోటీసులు లేకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కరాకండిగా ప్రకటించారు. ఫేక్ ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, మాపై తప్పుడు వార్తలు రాస్తే డిఫమేషన్ కేసు వేస్తామని, ఇప్పటికే ఒక పత్రికకు లీగల్ నోటీసులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే ఎదురొచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలని, డబ్బులు తీసుకొని యూట్యూబ్‌లు నడిపించడం సరికాదని అన్నారు. జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టి సోషల్ మీడియా వారియర్స్‌కు ఈ ప్రచారంపై అవగాహన కల్పించాలని ఆయన పార్టీ శ్రేణులను ఆదేశించారు.








