- ఓడిన చోటే గెలిచి చూపిద్దాం
- దొంగ ఓట్లు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు
- కర్ణాటక మనుషులతో దొంగ ఓట్లు వేయించారు
- జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్.. ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఓడిన చోటే గెలిచి చూపిద్దాం” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దివంగత గోపీనాథ్ మరణానంతరం ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం తాము మరింత కష్టపడి, “కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం” అని హామీ ఇస్తూ కార్యకర్తల్లో భరోసా నింపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు..
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని, షేక్ పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంచి గెలిచారని విమర్శిస్తూ, ఇది నైతిక గెలుపు కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నప్పటికీ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన హరీష్ రావును కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 407 బూతుల్లో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. “ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి” అనే సామెతను గుర్తు చేస్తూ, గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.








