Mahaa Daily Exclusive

  ప్రకృతి వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి హబ్‌గా మారుతుంది: మోదీ

Share

  • రైతుల ఖాతాలో రూ.2 వేలు జమ
  • పీఎం కిసాన్ సాయం విడుదల చేసిన ప్రధాని
  • 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్ల నిధులు జమ
  •  తమిళనాడులోని కోయంబత్తూరులో 21వ విడత నిధులు రిలీజ్
  • ప్రకృతి వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి హబ్‌గా మారుతుంది: మోదీ

తమిళనాడు, మహా: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ నిధులు విడుదలయ్యాయి. బుధవారం ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లకు పైగా నిధులు జమ కానున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి హబ్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది స్వదేశీ విధానమని, సంప్రదాయంగా వస్తోందని మోదీ వివరించారు. రైతులు ఏడాదికి ఒక ఎకరం చొప్పున క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మారాలని పిలుపునిచ్చారు. అలాగే రైతులు చేతులేత్తి తమ టవల్ను ఊపుడం చూస్తే బిహార్ గాలులు తన కంటే ముందే తమిళనాడులో వీచినట్లుగా ఉందని అన్నారు.

11 ఏళ్లలో వ్యవసాయ రంగంలో భారీగా మార్పులు..
‘వాతావరణ మార్పులు, నేల సారం సమస్యలకు ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడే పరిష్కారం. అధిక రసాయనాలు, పురుగుమందుల వాడకంతో నేలసారం బాగా దెబ్బతింటోంది. మిల్లెట్స్‌ సూపర్‌ ఫుడ్‌. వాటిని రైతులు సాగు చేయాలి. గత 11 ఏళ్లలో వ్యవసాయ రంగంలో భారీగా మార్పులు జరిగాయి. వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెండింతలయ్యాయి. వ్యవసాయాన్ని ఆధునికత దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులకు సహాయం చేయడానికి అన్ని మార్గాలను విస్తృతంగా ప్రారంభించింది. రాబోవు సంవత్సరాల్లో భారత వ్యవసాయ రంగంలో అనేక భారీ మార్పులను చూడనున్నాం. ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ హబ్‌గా మారే దిశలో భారత్‌ పయనిస్తోంది. మన జీవవైవిధ్యం కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ యువత వ్యవసాయాన్ని ఆధునికమైన, విస్తృతి కలిగిన అవకాశంగా చూస్తున్నారు. దీనివల్ల దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.

2019 ఫిబ్రవరి 24న స్కీమ్ ప్రారంభం..
2019 ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో నిధులు విడుదలయ్యాయి. రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. భూమి వివరాలు పీఎం, కిసాన్ పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకు ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.
=================

Latest