- స్త్రీ శక్తికి బాటలు వేసే చారిత్రక ఘట్టమిది
- వివక్ష తొలగింపునకు నిపుణుల సలహాలు కీలకం
- ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క
హైదరాబాద్, మహా: మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశామని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా తొలగించేందుకు నిపుణులు, మేధావులు, అధికారులు ఇచ్చే సూచనలు అత్యంత ఉపయోగకరమవుతాయని పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. కాన్ఫరెన్స్‌లో మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్ష నిర్మూలన, లింగ సమానత్వం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. నిపుణుల అభిప్రాయాలు, సూచనలు, అనుభవాలను ప్రభుత్వం తెలుసుకుని భవిష్యత్ విధానాల్లో ప్రతిబింబింపజేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ, సమాజపు పోకడల కారణంగా అవి ప్రాక్టికల్‌గా అమలుకావడంలో సమస్యలు వస్తున్నాయని, పని ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలను చెప్పుకునే అవకాశాలు కోల్పోతున్నారని మంత్రి వివరించారు. ఈ చర్చ రాజకీయ కార్యక్రమం కాదని, మహిళల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ఘట్టం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతాలక్ష్మి, అనిత రామచంద్రన్, జి సృజన, శృతి ఓజా, ఐ& పీఆర్ కమిషనర్ ప్రియాంకా ఆల, అదనపు డీజీ. అభిలష్ బిస్త్‌తో పాటు పలువురు మహిళా ఐపీఎస్లు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు, నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.








