- సీబీఐ కోర్టులో ముగిసిన జగన్ విచారణ
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా హాజరైన జగన్
హైదరాబాద్, మహా : నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ ముగిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు జగన్ గురువారం సీబీఐ కోర్టుకు వచ్చారు. ఇన్నిసంవత్సరాల విచారణలో జగన్ కు వ్యక్తిగత హాజరునుండి మినహాయించిన కోర్టు తాజాగా వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేసింది. వ్యక్తిగత మినహాయింపును సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపధ్యంలోనే గురువారం జరిగిన విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ అక్కడి నుండి నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
ఘన స్వాగతం పలికిన అభిమానులు
బేగంపేట విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. నేతలు, అభిమానులకు అభివాదం చేస్తు విమానాశ్రయంనుండి బయటకు వచ్చిన జగన్ తో పాటు అభిమానులు భారీఎత్తున ర్యాలీగా సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎయిర్ పోర్టు, నాంపల్లి కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కోర్టులో జగన్ తో పాటు లాయర్లను తప్ప ఇంకెవరినీ పోలీసులు అనుమతించలేదు. విచారణ ప్రక్రియ ముగియగానే జగన్ లోటస్ పాండ్ లోని తన నివాసంకు చేరుకున్నారు. అక్కడి నుండి తల్లి విజయమ్మ దగ్గరకు వెళ్ళారు. జగన్ హైదరాబాదుకు చాలా కాలం తర్వాత వచ్చారు. దాంతో ఎయిర్ పోర్టుతో పాటు కోర్టు దగ్గర అభిమానులు పెద్దఎత్తున హడావుడిచేశారు.








