- తెలంగాణ విద్యార్థుల చారిత్రక విజయం
- విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంస
- జాతీయ వేదికపై గిరిజన విద్యార్థుల ప్రతిభ.. 230 పతకాలతో రికార్డు
హైదరాబాద్, మహా: ఒడిశాలోని రౌర్కెలా-సుందర్గఢ్లో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) జాతీయ క్రీడా సమవేశం- 2025లో తెలంగాణ విద్యార్థులు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ఎస్ పాఠశాలల మధ్య జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ జట్టు ట్రోఫీలను సొంతం చేసుకుని రాష్ట్ర గౌరవాన్ని పెంచింది. తెలంగాణలోని 23 ఈఎంఆర్ఎస్ సంస్థల నుండి 580 మంది విద్యార్థులు, 68 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరు తుపాకీ షూటింగ్, పరుగు పందాలు, బాక్సింగ్, దేహదారుఢ్య విన్యాసాలు, జూడో, ఈత, తైక్వాండో, బరువులు ఎత్తడం, కుస్తీ, యోగా, బుట్టపందిరి ఆట, ఖో-ఖో వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 230 పతకాలు సాధించారు.
ఈ ఘన విజయంపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సచివాలయంలో తన గదిలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “రౌర్కెలాలో జరిగిన క్రీడా పోటీల్లో తెలంగాణ విద్యార్థులు సాధించిన 230 పతకాలు గిరిజన యువత ప్రతిభకు జాతీయస్థాయి గుర్తింపు” అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న నూతన క్రీడా విధానం, ఈఎంఆర్ఎస్లలో ప్రపంచస్థాయి క్రీడా వాతావరణం సృష్టించడంలో గొప్ప పాత్ర పోషించిందని మంత్రి చెప్పారు. ఈ విజయం తెలంగాణ ఈఎంఆర్ఎస్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు, నైపుణ్యం, శిక్షణ అందిస్తుందనే దానికి నిదర్శనం అని అన్నారు. పతకాలు సాధించిన విద్యార్థుల క్రమశిక్షణ, శ్రమ, పట్టుదలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి కే. సీతాలక్ష్మి, ఈఎంఆర్ఎస్ అధికారులు, శిక్షకులు, ఉపాధ్యాయులు పాల్గొని విజేతలను అభినందించారు.








