Mahaa Daily Exclusive

  బ్రెజిల్ వాతావరణ సదస్సులో మంటలు…20 మందికి తీవ్ర గాయాలు…

Share

  • బ్రెజిల్ వాతావరణ సదస్సులో మంటలు
  • 20 మందికి తీవ్ర గాయాలు
  • వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • ఇండియా నుంచి కేంద్ర మంత్రి భూపేందర్
  • ఐరాస ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మిట్
  • నాలుగు రోజుల క్రితం ఆదివాసీల రచ్చ రచ్చ
  • మొదటినుంచి గందరగోళంలోనే ఈ సమ్మిట్

బ్రెజిల్, మహా : వాతావరణ మార్పులపై చర్చించేందుకు బ్రెజిల్ లోని బెలేమ్ నగరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కీలకమైన కాప్-30 సదస్సు ఆకస్మిక అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమావేశ మందిరంలో మంటలు, దట్టమైన పొగ రావడంతో వెంటనే ప్రతినిధులను, అక్కడున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వేదికపై ఉన్న గుడారానికి మంటలు అంటుకున్నాయని, ఒక వ్యక్తి అగ్నిమాపక యంత్రాన్ని ఉపయోగించి అదుపు చేసేందుకు ప్రయత్నించడం వీడియోల్లో కనిపించింది. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ ఘటన వల్ల చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలు అదుపులోకి వచ్చాయని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సుకు ఇండియా నుంచి కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సహా 20 మంది ప్రతినిధులు వెళ్లారు. నాలుగు రోజుల క్రితం సమ్మిట్ వద్ద అమెజాన్ వంటి అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ఆదివాసీలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అడవులను నరికేస్తున్నారని, తమకు భూమి హక్కులు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఇలాంటి సదస్సుల వల్ల ప్రయోజనం లేదని వారు మండిపడ్డారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో భారీ అగ్ని ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది.