Mahaa Daily Exclusive

  విశ్వం ఆమెకే వశం..మిస్‌ యూనివర్స్‌-2025గా ఫాతిమా బాష్‌

Share

  • విశ్వం ఆమెకే వశం..
  • మిస్‌ యూనివర్స్‌-2025గా ఫాతిమా బాష్‌
  • కిరీటాన్ని దక్కించుకున్న 25 ఏళ్ల అందాల భామ
  •  థాయ్‌లాండ్‌లోని నాంథబురిలో ఆట్టహాసంగా వేడుక
  • మిస్‌ యూనివర్స్‌ విజేతకు 2,50,000 డాలర్ల ప్రైజ్‌ మనీ

ఈ ఏడాది పోటీ థీమ్ ‘ది పవర్ ఆఫ్ లవ్’ (ప్రేమ శక్తి) పేరుతో
థాయ్‌లాండ్: ప్రపంచ సుందరీ పోటీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికో గెలుచుకుంది. నవంబర్ 21, 2025న థాయ్‌లాండ్‌లోని నాంథబురిలో ఉన్న ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌లో జరిగిన ఈ తుది పోటీలో, ఫాతిమా బాష్ విశ్వ సుందరిగా కిరీటాన్ని ధరించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు, భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.

టాప్ 30కే భారత్ పరిమితం..
భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మణికా విశ్వకర్మ గట్టి పోటీనిచ్చినప్పటికీ, టాప్ 30లో తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. అయితే, ఆమె ఆ తదుపరి రౌండ్‌లలోకి, అంటే టాప్ 12లోకి అడుగు పెట్టలేకపోయారు. దీంతో భారత్‌కు నాలుగో విశ్వ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టాలన్న మణికా ప్రయత్నం ఫలించలేదు. ఈ ఏడాది పోటీ థీమ్ ‘ది పవర్ ఆఫ్ లవ్’ (ప్రేమ శక్తి) గా నిర్ణయించారు. ఇది ఐక్యత, సాధికారత, దృఢత్వం వంటి అంశాలపై దృష్టి సారించింది.

విశ్వ సుందరి 2025 టాప్ 5 విజేతలు..
విజేత ఫాతిమా బాష్‌తో పాటు, మిగిలిన టాప్ 5 స్థానాలను ఈ కింది సుందరీమణులు దక్కించుకున్నారు.
విజేత: మెక్సికో – ఫాతిమా బాష్
1వ రన్నర్-అప్: థాయ్‌లాండ్ – ప్రవీణార్ సింగ్
2వ రన్నర్-అప్: వెనిజులా – స్టెఫానీ అబసాలి
3వ రన్నర్-అప్: ఫిలిప్పీన్స్ – అహ్తిసా మనాలో
4వ రన్నర్-అప్: కోట్ డి’ఐవోర్ – ఒలివియా యేస్

ప్రైజ్‌ మనీ ఇదే..
మిస్‌ యూనివర్స్‌ విజేతకు నగదు బహుమతి ఎంతనే వివరాలను ఆర్గనైజేషన్‌ వెల్లడించలేదు. అయితే, విశ్వసుందరి కిరీటం దక్కిన వారికి 2,50,000 డాలర్ల ప్రైజ్‌ మనీ ఇస్తారని పలు కథనాలు వెల్లడించాయి. దీంతో పాటు నెల నెలా 50వేల డాలర్ల వేతనం కూడా అందుతుంది. ఇక, అందాల రాణి ధరించే కిరీటం ధర 5 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.44కోట్లు) పైనే ఉంటుంది. విశ్వసుందరికి న్యూయార్క్‌ నగరంలో మిస్‌ యూనివర్స్‌ అపార్ట్‌మెంట్స్‌లో సంవత్సరం పాటు ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తారు. మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ విజేతకు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, సహాయకులతో కూడిన బృందాన్ని ఉచితంగా నియమిస్తుంది.

వ్యక్తిగత జీవితం, విద్య..
ఇక ఫాతిమా బాష్ ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకుని, ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆమె నేపథ్యం, విద్యాభ్యాసం వివరాలు ఇక్కడ ఉన్నాయి. లాటిన్ టైమ్స్ ప్రకారం, ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ మెక్సికోలోని శాంటియాగో డి టియాపా ప్రాంతానికి చెందినవారు. ఆమె యూనివర్సిడాడ్ ఇబెరోఅమెరికానాలో ఫ్యాషన్ అండ్ అపెరెల్ డిజైన్ కోర్సును అభ్యసించారు. తరువాత, ఆమె మిలన్‌లో ఉన్న నువోవా అకాడెమియా డి బెల్లే ఆర్టిలో, అలాగే యూఎస్‌ఏలోని వెర్మోంట్‌లో ఉన్న లిండన్ ఇన్‌స్టిట్యూట్లో అదనపు ఉన్నత విద్యను పూర్తి చేశారు. 25 ఏళ్ల ఫాతిమా బాష్ తన పాఠశాల రోజుల్లో డిస్లెక్సియా, అటెన్షన్-డెఫిసిట్/హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలతో పోరాడినట్లు బహిరంగంగా తెలిపారు. ఫాతిమా బాష్ స్వస్థలమైన మెక్సికోలోని టబాస్కో రాష్ట్రం నుంచి విశ్వ సుందరి పోటీల్లో అంతర్జాతీయంగా పాల్గొన్న మొదటి మహిళ ఈమే. అంతేకాకుండా, ఈ రాష్ట్రం తరఫున విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఈమే.
================