- హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు బిగ్ షాక్
- రూ.19.64 కోట్ల విలువైన స్థిరాస్తి ఈడీ వేలం
- వేలం మొత్తాన్ని హీరా గ్రూప్ బాధితులకు అందజేత
- రూ.5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు
హైదరాబాద్, మహా: హీరా గోల్డ్ నౌహీరా షేక్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.19 కోట్ల పై చిలుకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే హీరా గోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించారు. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రూ.5900 కోట్లు వసూలు చేసి నౌహీరా షేక్ బిచాన ఎత్తివేశారు. ఆమెపై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ వేలంలో నౌహీరా షేక్ ఆస్తి రూ.19.64 కోట్లను వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని మోసపోయిన బాధితులకు లేదా పెట్టుబడిదారులకు తిరిగి వినియోగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
రూ.5,978 కోట్ల మోసం చేసినట్లు గుర్తించారు
కాగా, నౌహీరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది. ఆమెకు సంబంధించిన ఒక స్థిరాస్తిని రూ.19.64 కోట్లకు విజయవంతంగా వేలం వేశారు ఈడీ అధికారులు. శుక్రవారం ఆ ఆస్తి రిజిస్ట్రేషన్‌ను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. ఈ ఆస్తిని ఈడీ 16.08.2019న తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్ ద్వారా స్వాధీనం చేసుకుంది. నౌహీరా షేక్ రూ.5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నౌహీరా షేక్, ఇతరులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో సహా పలు రాష్ట్రాల్లోని పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి.. అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ( పీఎంఎల్‌ఏ– 2002) కింద దర్యాప్తు చేపట్టింది. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. నౌహీరా షేక్, ఇతరులు ప్రజలను ఓ పథకం ప్రకారం నమ్మించి రూ. 5,978 కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించారు. సంవత్సరానికి 36శాతం కంటే ఎక్కువ లాభం ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. కానీ బాధితులకు మూలధనం కూడా తిరిగి ఇవ్వకుండా భారీ మోసం చేశారు. రూ.428 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పటికే అటాచ్ చేసింది.








