Mahaa Daily Exclusive

  నేనెవరికీ భయపడను:ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Share

  • నేనెవరికీ భయపడను
  • ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తా, మళ్ళీ గెలుస్తా
  • స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హైదరాబాద్, మహా : స్టేషన్ ఘన్ పూర్ కు ఉప ఎన్నిక అంటూ వస్తే మళ్ళీ నేనే పోటీ చేస్తా, తిరిగి గెలుస్తా, ప్రజల ఆశీర్వాదం నాకే ఉంది అని సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణరాజకీయాల్లో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణపై సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపించడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఈ నేపధ్యంలోనే కడియం శనివారం మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వటానికి గడువు కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు కడియం చెప్పారు. స్పీకర్‌ ఇచ్చిన గడువులోగా వివరణ ఇస్తానని వెల్లడించారు. స్పీకర్ నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. ‘‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి పెద్దఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కడియం శ్రీహరి ఎవ్వరికి భయపడడు’ అని అన్నారు. నేడు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, ఇందుకోసమే నేను కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నానని అన్నారు.

Latest