Mahaa Daily Exclusive

  పార్టీ బలోపేతంపై పవన్ నజర్…

Share

పార్టీ బలోపేతంపై పవన్ నజర్
సంస్థాగత నిర్మాణం, కమిటీల కూర్పుపై డిప్యూటీ సీఎం కసరత్తు
కార్యకర్తల అభిప్రాయ సేకరణతో సంస్థాగత మార్పులు

హైదరాబాద్, మహా: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, వివిధ కమిటీల కూర్పుపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన విజయం సాధించి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, నియోజకవర్గ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన ఉన్నత స్థాయి కసరత్తును ప్రారంభించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చూసేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు. ఇందులో భాగంగా, జనసేన కార్యకర్తలు, నాయకులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత..
నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, జనంలో పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి అంశాలపై కార్యకర్తల మనోగతాన్ని ఆయన నమోదు చేసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సమర్థత, నిబద్ధత కలిగిన కొత్త నాయకులను కమిటీల్లో భాగస్వామ్యం చేయడంపై ఉపముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. రాబోయే కాలంలో పార్టీని ప్రజా ఉద్యమాలకు సిద్ధం చేసే దిశగా ఈ సంస్థాగత మార్పులు ఉపయోగపడతాయని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

Latest