- భూములను కొల్లగొట్టే స్కాములకు తెరలేపిన సీఎం
- రూ. 5 లక్షల కోట్ల భూమిని.. రూ. 5 వేల కోట్లకే కట్టబెట్టే కుట్ర
- టీజీఐఐసీ రేటు కాదని ఎస్సార్వోపై 30 శాతం మాత్రమే ఎందుకు?
- పేదవాడికి ఒక న్యాయం.. పెద్దోడికి మరో న్యాయమా?
- రెండు నెలల్లో స్కాం పూర్తికి రేవంత్ సర్కారు స్కెచ్
- పాలసీ వెనుక ఉన్న మతలబు ఏమిటి? – 8 ప్రశ్నలతో హరీశ్ రావు సవాల్
హైదరాబాద్, మహా: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్-టీపీ) ఒక తాజా స్కాం అని, ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలు దోపిడీ మీదే దృష్టి పెట్టారని, దాదాపు 10 వేల ఎకరాల భూమిని పప్పుబెల్లాల్లా అమ్ముకునే కుట్రకు తెరలేపారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో పెట్టుబడుల వార్తలు వచ్చేవని, కాంగ్రెస్ హయాంలో మాత్రం అమ్మకాల వార్తలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో రేవంత్ రెడ్డి భూములు అమ్ముకుంటూ పోతే స్మశానాలకు కూడా స్థలం మిగలదన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడి భూములు తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని హరీశ్ రావు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన లెక్కల ప్రకారమే 9,292 ఎకరాల భూమిని కేవలం 30% ఎస్సార్వో ధరకు రెగ్యులరైజ్ చేయడం ద్వారా రూ. 5 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వస్తున్నాయని, కానీ ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ. 5 లక్షల కోట్లు ఉంటుందని లెక్క కట్టారు. దీనిని బట్టి, మిగతా రూ. 4.95 లక్షల కోట్లు ‘స్కాం’ కాదా అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణం పరిధిని తగ్గించే ప్రయత్నంలో మంత్రి శ్రీధర్ బాబు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కేవలం 4,740 ఎకరాలేనని బుకాయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌తో పోల్చితే ఈ స్కాం రెండు రెట్లు ఎక్కువని, ఇంత పెద్ద నిర్ణయాన్ని అసెంబ్లీలో చర్చించకుండా రాత్రికి రాత్రే చేయడంపై ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వంపై 8 ప్రశ్నలతో సవాల్:
ఈ పాలసీ వెనుక ఉన్న మతలబుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు బీఆర్‌ఎస్ పక్షాన 8 ప్రశ్నలను సంధించారు. 1. టీజీఐఐసీ రేటు కంటే తక్కువగా ఉన్న ఎస్సార్వో రేటులో కేవలం 30% మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? 2. త్వరలో ఎస్సార్వో ధరలు పెంచుతామని చెప్పి, అది అమలులోకి రాకముందే ఈ పాలసీని ఎవరి మేలు కోసం హడావుడిగా తీసుకొచ్చారు? 3. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వంద రూపాయలు తీసుకొని ఖజానా నింపితే, మీరు ఎందుకు ₹30కే తగ్గించి లక్షల కోట్ల నష్టం కలిగిస్తున్నారు? 4. పేదవాడు కొన్న కొద్ది గజాల భూమికి సైతం ఎస్సార్వోపై 60-80% ఎల్ఆర్‌ఎస్ వసూలు చేసి, ధనవంతులకు 30%కే మల్టిపుల్ జోన్‌గా మార్చడం పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం కాదా? 5. ఈ 30%లో ఆల్ ప్రాసెసింగ్ ఫీజులు కూడా కలిపి హెచ్‌ఎండీఏకు రావాల్సిన రూ. 13,500 కోట్లు రాకుండా చేశారా? 6. ఓఆర్‌ఆర్ లోపల మాత్రమే కాదు, చుట్టుపక్కల భూములు కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో ఉందా? ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ కాదా? 7. ఆరు నెలల కిందనే దీనికి రూపకల్పన చేసి అనుముల బ్రదర్స్ అగ్రిమెంట్లు చేసుకున్నారనేది నిజం కాదా? 8. వచ్చే 30% డబ్బును కొత్త పరిశ్రమలకు వాడుతారా లేక కాంట్రాక్టర్ల బిల్లుల కోసం వాడుతారా?
అసెంబ్లీలో చర్చకు డిమాండ్..
‘ఇది మీ అయ్య జాగీరు కాదు, నాలుగు కోట్ల ప్రజల ఆస్తి’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం కలిగించే ఈ పాలసీని వెంటనే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. పారిశ్రామిక వేత్తలకు తాము ఇన్సెంటివ్‌లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్లు, వ్యాపారుల కోసం భూములు అమ్మడానికి ‘హిల్-టీపీ’ పాలసీ తెచ్చిందని విమర్శించారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు, తాను అడిగిన ఎనిమిది ప్రశ్నలకు నిజాయితీ ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే, ప్రజల హక్కులు, ఆస్తులు కాపాడటం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ప్రజా క్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.






