- తెలంగాణ చరిత్రలో అందెశ్రీకి శాశ్వత స్థానం
- సహజకవి అందెశ్రీకి కోహినూర్ స్థాయి గౌరవం
- జయ జయహే తెలంగాణ’ కవికి ఘన నివాళి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం
- ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన అందెశ్రీని ప్రభుత్వం మరువదు
- అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా: “వజ్రాల గురించి దశాబ్దాలు, శతాబ్దాలు చర్చించినా కోహినూర్ వజ్రానికి పోటీ లేనట్టే… కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో అందెశ్రీ మొదటి స్థానంలో నిలబడతారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. జీవితంలో బడి ముఖమే చూడని సహజకవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం ఈ రోజు ప్రతి బడిలో పాడుకునేంతగా యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిందని కొనియాడారు. బడి ముఖమే చూడని అందెశ్రీ అన్న ‘జయ జయహే తెలంగాణ’ అంటూ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపితేనే రాష్ట్ర కల నిజమైంది. నాలుగు కోట్ల ప్రజలు కోరుకున్న ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా, ప్రజా ప్రభుత్వం దానిని పాఠ్య పుస్తకాల్లో మొదటి అంశంగా చేర్చింది. ఉద్యమంలో స్ఫూర్తిని నింపిన అందెశ్రీని, ఆయన పోరాటాన్ని ప్రభుత్వం ఎన్నటికీ మరువబోదని ముఖ్యమంత్రి ప్రకటించారు.
సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా 5 దశాబ్దాల పాటు పని చేసిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందెశ్రీ కీర్తిని తెలంగాణ చరిత్రలో శాశ్వతం చేయడంతో పాటు, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందెశ్రీ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్మతివనం కట్టాలనుకున్నామని, ఆయన రాసిన నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాక, అందెశ్రీ పేరిట జానపద విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు సభలో వక్తలు చేసిన ఇతర సూచనలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 9 మంది ఉద్యమ కారులు, కవులు, కళాకారులకు 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించామని, వారు ఆత్మగౌరవంతో బతికేలా భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం, అదిల్ ఉల్లా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొని అందెశ్రీకి నివాళులర్పించారు.






