- పంచాయతీ ఎన్నికలకు సిద్ధం
- ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ
- నేడు హైకోర్టు విచారణ తర్వాత నోటిఫికేషన్!
- సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం
హైదరాబాద్, మహా: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎస్ఈసీకి పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. గత రెండు రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతోపాటు, లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లను కూడా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సింది. అయితే, ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందువల్ల విచారణ జరగలేదు. మంగళవారం విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీల్లోని 1,12,288 వార్డుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
నేడు కేబినెట్ సమావేశం..
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా-ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.








