హైదరాబాద్, మహా.
హర్యానా వేదికగా జరగనున్న 35వ సబ్ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని కాసాని కబడ్డీ అకాడమీలో నిర్వహించిన ఎంపిక పోటీలలో ప్రతిభ కనబరిచిన 14 మంది బాలురు, 14 మంది బాలికలను తుది జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన ఈ క్రీడాకారులు నవంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. మహేందర్ రెడ్డి, ప్రముఖ భారత కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు కురుమూర్తి, ప్రశాంత్, సుధాకర్ రావు, తిరుపతి రెడ్డిలతో పాటు కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.
బాలుర విభాగంలో ఎంపికైన జట్టులో సూర్యాపేట నుండి వరుణ్, హైదరాబాద్ నుండి రాఘవేంద్ర, కిరణ్, దివాకర్, మహబూబ్ నగర్ నుండి గౌతమ్, మేడ్చల్ నుండి రాకేష్, సునిల్, ములుగు నుండి శేషు, నారాయణపేట్ నుండి శ్రీకాంత్, హనుమకొండ నుండి మహ్మద్ ఆఫ్రోజ్, వికారాబాద్ నుండి రమేష్, కరీంనగర్ నుండి విష్ణువర్ధన్, సంగారెడ్డి నుండి పవిత్, జనగాం నుండి కార్తిక్ స్థానం దక్కించుకున్నారు.
బాలికల విభాగంలో ఎంపికైన వారిలో నాగర్ కర్నూల్ నుండి నందిని, నల్గొండ నుండి అఫా, సాయి అభిగ్న, ఆదిలాబాద్ నుండి హరిప్రియా, జనగాం నుండి సింధు, ఖమ్మం నుండి బండాల హనీ, అంజు శ్రీ, రంగారెడ్డి నుండి మేఘనా, సాన్వి రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం నుండి స్నేహ ప్రియా, నిహారిక, వరంగల్ నుండి సంజన శ్రీ, నిజామాబాద్ నుండి గౌతమి, కరీంనగర్ నుండి కీర్తన ఉన్నారు. వీరంతా జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని అసోసియేషన్ ప్రతినిధులు ఆకాంక్షించారు.






