Mahaa Daily Exclusive

  అయ్యప్ప మాల ధరిస్తే సెలవు పెట్టాల్సిందే.

Share

అయ్యప్ప మాల ధరిస్తే సెలవు పెట్టాల్సిందే.
*ఖాకీ డ్రెస్సులో దీక్ష వస్త్రాలకు నో పర్మిషన్.
* తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం
* ఎస్సైకి మెమో జారీపై రాజాసింగ్, వీహెచ్‌పీ ఆగ్రహం.
* పోలీస్ బాస్ ఆదేశాలపై దుమారం.

హైద్రాబాద్, మహా.

*తెలంగాణ పోలీసు శాఖ తాజాగా జారీ చేసిన కొన్ని అంతర్గత ఆదేశాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు మతపరమైన దీక్షలు పాటించడం, యూనిఫామ్ కాకుండా ఇతర వస్త్రధారణ చేయడంపై శాఖాపరమైన ఆంక్షలు విధించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రత్యేకించి అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ, మతపరమైన రంగు పులుముకుంది. దీనిపై హిందూ సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు*

మతపరమైన దీక్షల సమయంలో పాటించాల్సిన నియమావళిపై తెలంగాణ పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు యూనిఫామ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఒకవేళ దీక్షలు స్వీకరించాలనుకుంటే సెలవులు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఎస్. కృష్ణకాంత్ ఇటీవల అయ్యప్ప దీక్ష స్వీకరించారు. దీక్షా నియమాల్లో భాగంగా ఆయన నల్లటి దుస్తులు ధరించి, గడ్డం పెంచి విధులకు హాజరయ్యారు. యూనిఫామ్ కోడ్ ఉల్లంఘన కింద భావించిన సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ) శ్రీకాంత్, సదరు ఎస్సైకి మెమో జారీ చేశారు. డ్యూటీలో ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ వేసుకోవడం, గడ్డం పెంచడం నిబంధనలకు విరుద్ధమని అందులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. కేవలం హిందూ పండుగల సమయంలోనే పోలీసు శాఖ ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తుందని ఆయన ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలని, సమాజాన్ని లేదా మతాన్ని బట్టి నిబంధనలు ఉండకూడదని ఆయన హితవు పలికారు. పోలీసు శాఖ అనవసరమైన నిబంధనలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ యూనిట్ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అయ్యప్ప దీక్షలో ఉన్న ఎస్సైకి మెమో ఇవ్వడం హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. మెమో జారీ చేసిన ఏడీసీపీ శ్రీకాంత్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఈ ఆదేశాలను సమర్థించుకుంటున్నారు. పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు క్రమశిక్షణ, యూనిఫామ్ కోడ్ ముఖ్యమని ఏడీసీపీ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. గడ్డం పెంచుకోవడం, బూట్లు లేకుండా సివిల్ డ్రెస్ ధరించి విధులకు హాజరుకావడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. దీక్షలు పాటించే వారి మనోభావాలను గౌరవిస్తామని, అయితే వారు దీక్షా సమయంలో సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసులు డ్యూటీ చేయరాదంటూ నోటీసులు రావడం వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో మరోసారి సోషల్ మీడియా వేదికగా పోలీసు శాఖ తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

Latest