Mahaa Daily Exclusive

  చీర మాత్రమే కాదు.. రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే..!

Share

  • చీర మాత్రమే కాదు..
  • రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాల్సిందే
  • పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు, వడ్డీలేని రుణాలు లేవు
  • ఓట్ల కోసం రేవంత్ రెడ్డి సంకేమ పథకాలు ఇస్తున్నారు
  • మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

 

సిద్దిపేట, మహా: ఒక్క ఏడాదికి మాత్రమే చీర ఇచ్చి సారె పెట్టిన అని అంటున్నారని.. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వాల్సిన రూ.60 వేలు ఇచ్చి సారె పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మహిళలకు చీరలు అందించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83 వేల మంది మహిళలు ఉంటే లక్ష 99 వేల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు.

 

స్త్రీ నిధికి కూడా వడ్డీలేని రుణాలు ఏవీ?

పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు, వడ్డీలేని రుణాలు లేవని మాజీ మంత్రి హరీశ్ వ్యాఖ్యలు చేశారు. మహిళా సంఘాలు రూ. 25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే రూ.5 వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగబడుతోందని.. మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్త్రీ నిధికి కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం జిల్లాలోని మహిళ సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడా కూడా పెట్టలేదని విమర్శించారు. కేసీఆర్ పండుగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు సంకేమ పథకాలు ఇస్తున్నారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు.

Latest