- మంత్రి పదవిపై ఎలాంటి ఆసలు లేవు
- నా కుటుంబంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడింది
- రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపించాయి
- జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హైదరాబాద్, మహా : జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్మని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలపెట్టుకుంటానని, ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినా తనకు అండగా నిలిచిన జూబ్లీహిల్స్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. రాబోయే రోజుల్లో తన నియోజకవర్గం, పార్టీ అభివృద్ధి కోసం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్ అనంతరం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశ రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నా గెలుపు కోసం కృషి చేసిన సీఎం, మంత్రులతో పాటు పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తన గెలుపుకు దోహదం చేశాయని చెప్పారు. మంత్రి పదవిపై ఎలాంటి ఆశలు లేవన్నారు. గడచిన 30 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్న తన కుటుంబంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని నవీన్ యాదవ్ ఆరోపించారు. రాజకీయంగా నేను ఎదుగకుండా గతంలో ఎంఐఎం నుంచి టికెట్ రాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేసిందని, చివరకు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, బంధువులపై వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి నా జీవితమే నాశనం చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తే భగవంతుడే రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి తనకు అవకాశం కల్పించారని చెప్పారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. మా ప్రాంత ప్రజలకు అండగా ఉండటానికి నేను ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నానని అయితే మాగంటి గోపినాథ్ చనిపోవడంతో బైపోల్ వచ్చేదన్నారు. కేసు కోర్ట్ లో ఉన్నపుడే ఆయన కాలం చేశారని కేసు వెనక్కి తీసుకున్నామన్నారు. ఉప ఎన్నికల్లో తనకు సపోర్టు చేసిన ఎంఐఏం పార్టీకి కృతఙ్ఞతలు తెలిపారు.








