Mahaa Daily Exclusive

  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఆరోగ్య సదస్సులో మంత్రి దామోదర

Share

  • తెలంగాణ వైద్య సేవలు దేశానికే ఆదర్శం
  • ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
  • దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఐవీఎఫ్
  • తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఆరోగ్య సదస్సులో మంత్రి దామోదర

హైదరాబాద్, మహా: రాజ్‌భవన్‌లో తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్‌లో భాగంగా జరిగిన ఆరోగ్య సదస్సులో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాలు వేరైనా, భారతదేశ పౌరులుగా మనమంతా ఒక్కటేనని, పరస్పర సహకారంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు భారతదేశానికి బలం అని, ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో తెలంగాణ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం కేపిటల్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ, ఆరోగ్యపరంగా ఎటువంటి సహకారానికైనా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రివెంటివ్ అండ్ ప్రైమరీ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

సెకండరీ స్థాయిలో 184 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో స్పెషాలిటీ సేవలు, గాంధీ, ఉస్మానియా వంటి 48 టీచింగ్ హాస్పిటళ్ల ద్వారా టెర్షియరీ కేర్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా నూతన హాస్పిటల్, హైదరాబాద్‌లో 3 టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. అలాగే, 32 డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ద్వారా ఉచిత సేవలు, 2007లో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1800లకు పైగా రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నాన్-కమ్యూనికెబుల్ డిసీజెస్‌ బర్డెన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్‌సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేశామని, గతంలో 3 ఉన్న డయాలసిస్ సెంటర్ల సంఖ్యను నేడు 102కు పెంచి, మరో 79 సెంటర్లను త్వరలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

Latest