- తెలుగులో రాజ్యాంగం
- సామాన్యులకు మరింత చేరువ చేయడంలో ముందడుగు
- తెలుగు, ఇంగ్లీషు ద్విభాషా గ్రంథాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్, మహా: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ న్యాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ముద్రించిన భారత రాజ్యాంగం ద్విభాషా గ్రంథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సమగ్రంగా తెలుగులో అందించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. తెలుగులో రాజ్యాంగాన్ని ప్రచురించడం వల్ల భాష, సంస్కృతిని కాపాడటంతో పాటు, భావి తరాలు, మేథావులు, సాహిత్యాభిమానులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి, ఆ శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగులో తర్జుమా చేసి, సమగ్రంగా రాజ్యాంగాన్ని తెలుగు – ఇంగ్లీషు ద్విభాషలో అందించడం వల్ల అనేక విషయాల్లో స్పష్టత ఉంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, ఇది తెలుగు వారికి, సామాన్యులకు సైతం రాజ్యాంగం పట్ల సులభంగా అవగాహన పెంచుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇలాంటి ముఖ్యమైన గ్రంథం అందుబాటులోకి రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.






