Mahaa Daily Exclusive

  శబరిమల భక్తులకు శుభవార్త..! అన్నదానంలో ఇకపై ‘కేరళ సద్య’ వడ్డన..!

Share

  • శబరిమల భక్తులకు శుభవార్త..
  •  అన్నదానంలో ఇకపై ‘కేరళ సద్య’ వడ్డన!
  •  మెనూను మార్చిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు
  •  అన్నదానంలో భారీ మార్పులు చేసిన టీడీబీ.
  •  భక్తుల విరాళాలకు విలువిస్తూ.. సంప్రదాయ రుచులతో కొత్త మెనూ సిద్ధం!
  •  ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన భవనంలో ఇక పసందైన విందు..
  •  రోజుకు 10 వేల మందిక భోజనం.

 

హైద్రాబాద్,మహా.

 

**మండల, మకరవిళక్కు సీజన్ వేళ శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తీపి కబురు చెప్పింది. స్వామి వారి దర్శనం కోసం కఠిన దీక్షలతో వచ్చే భక్తులకు అందించే అన్నదానం మెనూలో సమూల మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ అమలులో ఉన్న సాదారణ మెనూ స్థానంలో, నోరూరించే సంప్రదాయ వంటకాలను వడ్డించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనం అందనుంది**

 

శబరిమల క్షేత్రంలో అయ్యప్ప భక్తుల ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమం ఇకపై కొత్త రుచులతో సాగనుంది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బోర్డు సమావేశంలో అన్నదానం మెనూను పూర్తిగా మారుస్తున్నట్లు బోర్డు నూతన అధ్యక్షుడు కె. జయకుమార్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో కేవలం వెజ్ పులావ్, సాంబార్ మాత్రమే అందిస్తుండగా, ఇకపై వాటి స్థానంలో పూర్తిస్థాయి కేరళ సంప్రదాయ భోజనమైన ‘సద్య’ను వడ్డించనున్నారు. ఈ కొత్త మెనూలో రుచికరమైన పాయసం, అప్పడాలు, ఇతర సంప్రదాయ వంటకాలు ఉండటం విశేషం.

అన్నదానం కోసం ఖర్చు చేస్తున్నది దేవస్వం బోర్డు సొంత డబ్బు కాదని, అది తోటి భక్తులకు మంచి జరగాలని కోరుకుంటూ భక్తులు సమర్పించిన పవిత్రమైన విరాళమని ఆయన గుర్తుచేశారు. అందుకే ఆ విరాళాలకు సరైన న్యాయం చేస్తూ, భక్తులకు అత్యుత్తమమైన భోజనాన్ని అందించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాణ్యమైన పదార్థాలతో సంప్రదాయ కేరళ భోజనాన్ని అందించే ఈ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. అంతేకాకుండా, పంబలో కూడా అన్నదానం సేవలను మరింత మెరుగుపరచడానికి, యాత్రికుల కోసం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని, దీనిపై డిసెంబర్ 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

మండల-మకరవిళక్కు సీజన్ కావడంతో ప్రస్తుతం శబరిమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం మరియు అన్నదాన ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. ఆలయం వెనుక భాగంలో ఉన్న మాలికాపురంలోని అన్నదాన భవనం ఆసియాలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతిరోజూ పది వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు అన్నదానాన్ని స్వీకరించడం విశేషం.

భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో పరిశుభ్రత విషయంలో కూడా అధికారులు రాజీపడటం లేదు. అన్నదానం విభాగంలో మొత్తం 235 మంది సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు. భోజనం చేసిన తర్వాత ప్లేట్లు, గ్లాసులను శుభ్రం చేయడానికి అత్యాధునిక డిష్‌వాషర్లను వినియోగిస్తున్నారు. వేడినీటితో వీటిని శుభ్రపరచడం ద్వారా పరిశుభ్రతను పాటిస్తున్నారు. మొత్తానికి బోర్డు తీసుకున్న ఈ కొత్త మెనూ నిర్ణయం, అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మంచి ఆతిథ్యాన్ని కూడా అందించనుందని చెప్పవచ్చు.

Latest