- పల్లె పోరులో ‘ఎర్ర’ కోటల గర్జన..
- హస్తం కుస్తీలో కామ్రేడ్ల కొత్త ఎత్తుగడ!
- కమ్యూనిస్టుల ‘సైలెంట్ ఆపరేషన్’ షురూ!
- మధిరలో మంటలు.. చింతకానిలో చిచ్చు..
- సామినేని హత్యతో మారిన పొలిటికల్ సీన్.
- ఉనికి కోసం సాగుతున్న ధర్మయుద్ధాలు!
- జిల్లాల్లో అగ్గిరాజేస్తున్న పొత్తు చిక్కులు..
- కేడర్‌కు ‘హై’కమాండ్ ఫ్రీ హ్యాండ్
ఖమ్మం బ్యూరో, మహా.
పల్లెసీమలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో, ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఇప్పుడు అధికారం కోసం అలుపెరగని పోరాటం మొదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంల బంధంపైనే పడింది. హైదరాబాద్ లో “దోస్తీ” అంటూ చేతులు కలిపిన నాయకులు, పల్లెల్లో మాత్రం “కుస్తీ”కి సై అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన వామపక్షాలు, ఈ స్థానిక సమరంలో మాత్రం సరికొత్త, సంచలనాత్మక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. “స్నేహం కోసం పార్టీని బలిపెట్టలేం.. మా అడ్డాలో మాదే రాజ్యం” అంటూ కమ్యూనిస్టులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తోంది. అసలు సిసలైన రాజకీయ చదరంగం ఇప్పుడు గ్రామాల్లో మొదలైంది.
**మిత్రపక్షమా? ప్రత్యర్థా?.. తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్**
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఆ మైత్రి ఫలించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీపీఐకి ఎమ్మెల్యే పదవి కూడా దక్కింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండకపోయినప్పటికీ, గ్రామాల్లో రాజకీయ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఇవి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో, తమకు తిరుగులేని బలం ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ కోసం తప్పుకునే ప్రసక్తే లేదని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు తేల్చి చెప్పాయి. ఇది కేవలం సీట్ల సర్దుబాటు సమస్య కాదు, పార్టీ ఉనికికి సంబంధించిన జీవన్మరణ సమస్యగా వామపక్షాలు భావిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎర్రజెండా రెపరెపలాడిన గ్రామాలను మిత్రపక్షం పేరుతో కాంగ్రెస్ కు అప్పగిస్తే, భవిష్యత్తులో అక్కడ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అందుకే “ఫ్రెండ్లీ కాంటెస్ట్” పేరుతో కొన్నిచోట్ల భీకర పోరుకు సిద్ధమవుతున్నారు.
**కంచుకోటల్లో ‘ఎర్ర’ జెండా పట్టు.. తగ్గని కామ్రేడ్ల పట్టుదల**
తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన భద్రాద్రి-కొత్తగుడెం, సూర్యపేట, యాదాద్రి-భువనగిరి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కమ్యూనిస్టులకు ఇంకా బలమైన ఓటు బ్యాంకు, పటిష్టమైన క్యాడర్ ఉంది. రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో ఉండే గ్రామ కమిటీలు మాత్రం రాజీకి ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో సీపీఎం, సీపీఐలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇలాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ, అధికారంలో ఉంది కాబట్టి పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఎర్రసైన్యం హెచ్చరిస్తోంది. అవసరమైతే సీపీఐ, సీపీఎం రెండూ వేర్వేరుగా బరిలోకి దిగి, త్రిముఖ పోరుకు తెరలేపే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది అంతిమంగా ఓట్ల చీలికకు దారితీసి, ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం లేకపోలేదు.
**చింతకానిలో రగులుతున్న ప్రతీకార జ్వాలలు.. మధిరపై ప్రత్యేక ఫోకస్**
ఈ ఎన్నికల్లో అత్యంత సెన్సేషనల్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గమే. ఇటీవల చింతకాని మండలంలో సీపీఎం సీనియర్ నేత, సౌమ్యుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక కమ్యూనిస్ట్ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదు. ఇది కేవలం ఒక నాయకుడి హత్యగా కాకుండా, తమ పార్టీపై జరిగిన దాడిగా సీపీఎం భావిస్తోంది. ఈ నేపథ్యంలో చింతకాని మండలంతో పాటు మధిర నియోజకవర్గంలో జరిగే సర్పంచ్ ఎన్నికలను సీపీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. “మా నాయకుడిని చంపారు.. ఇప్పుడు మా సత్తా ఏంటో ఓట్ల ద్వారా చూపిస్తాం” అనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా, లేకపోయినా.. సీపీఎం తన సత్తా చాటడానికి సర్వశక్తులూ ఒడ్డనుంది. ఈ పరిణామం అధికార పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది.
**లోకల్ డీల్స్.. వ్యూహాత్మక ఎత్తుగడలు**
రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఉన్నప్పటికీ, పంచాయతీ ఎన్నికల స్వభావం రీత్యా జిల్లా కమిటీలకు, మండల కమిటీలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వామపక్ష అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, ఎక్కడైతే పార్టీకి గెలిచే సత్తా ఉందో అక్కడ ఒంటరి పోరు చేస్తారు. ఎక్కడైతే కాస్త బలహీనంగా ఉన్నారో, అక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి, బదులుగా వార్డు మెంబర్ల సీట్లు లేదా ఉప సర్పంచ్ పదవుల కోసం బేరసారాలు ఆడుతున్నారు. అలాగే, ఉమ్మడి శత్రువులైన ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉన్నచోట, ఓట్లు చీలకుండా కాంగ్రెస్ తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించారు. స్థానిక పరిస్థితులు, గ్రామాభివృద్ధి, సామాజిక సమీకరణాలను బట్టి ఈ నిర్ణయాలు ఎక్కడికక్కడ మారుతూ ఉంటాయి. అంటే ఒక గ్రామంలో మిత్రులుగా ఉన్నవారు, పక్క గ్రామంలోనే బద్ధ శత్రువులుగా తలపడే విచిత్రమైన పరిస్థితి ఈ ఎన్నికల్లో కనిపించబోతోంది.
**అసలు టార్గెట్ ఎంపీటీసీ, జడ్పీటీసీలే.. కింగ్ మేకర్లుగా మారే ఛాన్స్**
సర్పంచ్ ఎన్నికలు కేవలం సెమీఫైనల్స్ మాత్రమేనని, అసలైన ఫైనల్స్ రాబోయే మండల , జిల్లా పరిషత్ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి కాబట్టి, సీట్ల పంపకాలు అధికారికంగా ఉంటాయి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా చాటితేనే, రేపు పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని వామపక్షాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను, అనేక మండల పరిషత్ అధ్యక్ష పదవులను డిసైడ్ చేసే శక్తి కమ్యూనిస్టుల చేతిలోనే ఉంది. వారి మద్దతు లేకపోతే ఈ జిల్లాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా స్వీప్ చేయడం అసాధ్యం. అందుకే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల ద్వారా తమ బలాన్ని ప్రదర్శించి, భవిష్యత్తులో “కింగ్ మేకర్లు”గా చక్రం తిప్పాలని సీపీఐ, సీపీఎంలు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి.








