Mahaa Daily Exclusive

  రాష్ట్ర ప్రయోజనాలే కీలకం..! ఎంపీలతో భట్టి విక్రమార్క సమీక్ష..!

Share

  • రాష్ట్ర ప్రయోజనాలే కీలకం
  • కేంద్రంపై పోరాటానికి ఐక్యత
  • ఎంపీలతో భట్టి విక్రమార్క సమీక్ష
  • పెండింగ్‌ అంశాలపై అన్ని పార్టీల ఎంపీలతో డిప్యూటీ సీఎం రివ్యూ

 

హైదరాబాద్, మహా: ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్‌లో సవరణ అత్యవసరమని గుర్తించి, ఈ అంశాన్ని పార్లమెంటులో అడ్జర్న్‌మెంట్ మోషన్ లేదా ప్రశ్నోత్తరాల ద్వారా బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. అన్ని పార్టీల ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్తు రాష్ట్ర కేబినెట్‌తో కలిసి, ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని తక్షణం అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు; ఇందులో విద్యుత్, నీటిపారుదల, ఎస్జీటీ తదితర శాఖలకు సంబంధించిన పెండింగ్ నిధుల వివరాలు సిద్ధంగా ఉంటాయన్నారు. కేంద్రానికి సంబంధించిన 12 శాఖలపై 47 పెండింగ్ అంశాలను గుర్తించి, సెమికండక్టర్ రంగంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షలో డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేయనున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలు, విజన్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు గల ప్రణాళికను కూడా సమగ్రంగా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ ఆర్థిక ప్రణాళికను పటిష్టం చేయడంలో మరియు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలలో ఆసక్తి ఉన్న ఎంపీలు చేరాలని ఆయన ఈ సందర్భంగా సూచన చేశారు.

Latest