Mahaa Daily Exclusive

  కేటీఆర్.. డ్రామా ఆపండి..! బీసీలకు 42% సీట్లు ఇస్తారా? మాజీ మంత్రికి సీతక్క ఛాలెంజ్..!

Share

  • బీసీల గొంతు కోసింది బీఆర్‌ఎస్సే
  • కేటీఆర్ అసత్య ప్రచారాన్ని ఖండించిన మంత్రి సీతక్క
  • స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించిన ఘనత బీఆర్‌ఎస్దే అని ఫైర్
  • బీసీలకు 42% సీట్లు ఇస్తారా? మాజీ మంత్రికి సీతక్క ఛాలెంజ్

 

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. గురువారం నాడు ప్రజాభవన్లో ఆమె మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. 2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను ఏకంగా 22 శాతానికి తగ్గించి, బీసీల గొంతు కోసిందని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ చేసిన ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. అలాగే, 2019లో బీఆర్‌ఎస్ ఖరారు చేసిన సర్పంచ్‌ రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేశారు.

 

బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితోనే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశామని వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని, కొన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో, ఆ పరిమితిని దాటకుండా ఉండేందుకే బీసీ రిజర్వేషన్లలో స్వల్ప మార్పు జరిగిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ నేతలు కుల గణనలో పాల్గొనలేదని, రిజర్వేషన్లు నిలిచిపోవాలని కోర్టుల్లో అడ్డంకులు సృష్టించిన పార్టీ బీఆర్‌ఎస్సేనని ఆమె విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం, రాజ్యాంగ హక్కుల ప్రకారమే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిపారు.

 

బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. “అసత్య ప్రచారాలు ఎక్కువకాలం నిలవవు. నిజం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది” అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని, పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా పోరాటం చేస్తూనే, పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, అదే విధంగా 42 శాతం సీట్లు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమా అని మంత్రి సీతక్క సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే రూ.3,000 కోట్లు నిలిచిపోయి గ్రామ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Latest