- యానిమేషన్, గేమింగ్,
- ఫిల్మ్ టెక్ హబ్‌గా తెలంగాణ
- తెలంగాణ విజన్ 2047 తో పక్కా రోడ్‌మ్యాప్
- 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం
- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా క్రీడా కేంద్రాలు
- తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, మహా: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ ఎదుగుదల-2047 విధాన పత్రం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 లక్ష కోట్ల, 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన ప్రణాళిక అవసరమని తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం కోర్-పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ, పరిసర-పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ, మరియు గ్రామీణ వ్యవసాయ ప్రాంత ఆర్థిక వ్యవస్థగా మూడు మండలాలుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్ధమవుతున్నట్లు, రాబోయే 22 ఏళ్ల కార్యాచరణను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే ప్రపంచ సదస్సులో ప్రభుత్వం ఆవిష్కరించబోతోందని తెలిపారు.
మౌలిక వసతులు, ఆర్థిక రంగాల బలోపేతం
హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణ మధ్య అభివృద్ధి సమతుల్యత సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం కోసం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా ఈ విజన్ పత్రంలో భాగంగా ఉంటుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటం సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంకుర సంస్థలు, పర్యాటకం, ఎగుమతులు వంటి రంగాల్లో రాబోయే రెండు దశాబ్దాల్లో వృద్ధిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీలం & పచ్చని హైదరాబాద్ లక్ష్యంగా మూసీ నది పునరుజ్జీవం, 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం ఇందులో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో రీజనల్ రింగ్ రోడ్డు, హై-స్పీడ్ రవాణా మార్గాలు, 4 పారిశ్రామిక కారిడార్లు, 11 రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
యువత నైపుణ్యం, ప్రపంచ వేదికపై తెలంగాణ
ప్రతి ఏడాది రెండు లక్షల యువతకు, లక్ష మంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా క్రీడా కేంద్రాలు, మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం సంపూర్ణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, హైదరాబాద్‌ను రాత్రి ఆర్థిక వ్యవస్థ నగరంగా తీర్చిదిద్దడం, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలతో తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించారు. ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలకు తెలంగాణను గమ్యస్థానంగా చేయాలని నిర్దేశించారు. ఈ విధాన పత్రం రాష్ట్రంలోని ప్రతి గ్రామంతో పాటు ప్రపంచ నగరమైన హైదరాబాద్ వరకు సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.






