- ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. రెండు రోజుల్లోనే చేతికి ‘ఉపాధి’ కార్డు.
- ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.
హైద్రాబాద్, మహా.
దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనాధారంగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెల్లోని పేదలకు పని కల్పిస్తూ, పట్టణాలకు వలసలను అరికట్టడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఈ పథకానికి అత్యంత ముఖ్యమైన జాబ్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కూలీలకు ఊరటనిచ్చేలా కేవలం 48 గంటల్లోనే కొత్త కార్డులను జారీ చేసేలా చర్యలు చేపట్టింది.
గ్రామీణ నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు పొందడం ఒకప్పుడు పెద్ద ప్రహసనంగా ఉండేది. కార్డు కోసం, లేదా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కార్యాలయాల్లో ఉండే రద్దీ, ఇతర కారణాల వల్ల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయేవి. కానీ, ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇకపై అర్హులైన కూలీలు దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే, అంటే రెండు రోజుల్లోనే ఉచితంగా కొత్త జాబ్ కార్డును పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ-కేవైసీ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. దీని ద్వారా అనర్హుల జాబ్ కార్డులను ఏరివేస్తూ, నిజమైన అర్హులైన కూలీలకు త్వరితగతిన కార్డులు అందజేస్తున్నారు. కొత్తగా కార్డు కావాల్సిన వారు తమ గ్రామంలోని క్షేత్ర స్థాయి సిబ్బందికి (ఫీల్డ్ అసిస్టెంట్) దరఖాస్తు అందజేస్తే సరిపోతుంది. ఆ దరఖాస్తులను వారు వెంటనే మండల కార్యాలయానికి, లేదా సంబంధిత అధికారులకు చేరవేస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, దరఖాస్తు చేసిన మరుసటి రోజే లబ్ధిదారులకు కొత్త జాబ్ కార్డు కాపీని అధికారులు అందజేయనున్నారు.
కేవలం కొత్త కార్డుల జారీ మాత్రమే కాకుండా, పాత కార్డులలో మార్పులు చేర్పులను కూడా ఇప్పుడు సులభతరం చేశారు. జాబ్ కార్డులో పేర్లు తప్పుగా ఉన్నా, చిరునామాలో సవరణలు చేయాలన్నా, లేదా కొత్త సభ్యులను చేర్చాలన్నా ఇదే వేగవంతమైన ప్రక్రియను అనుసరించనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కూలీలకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, పనులు దొరకడంలో గతంలో ఉన్న జాప్యం కూడా తగ్గుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సత్వరమే పని దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు.







