Mahaa Daily Exclusive

  టోనీ బ్లేర్ టు ఆనంద్ మహీంద్రా..! 3 వేల ప్రముఖులతో ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’..!

Share

  • టోనీ బ్లేర్
  • టు ఆనంద్ మహీంద్రా
  • హైదరాబాద్‌కు ప్రపంచ దిగ్గజాలు
  • 3 వేల ప్రముఖులతో ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’
  • మెస్సీ కిక్‌తో ముగింపు.. చరిత్ర సృష్టించనున్న ‘రైజింగ్ సమ్మిట్’
  • భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను ప్రపంచానికి చూపనున్న సీఎం రేవంత్
  • ‘తరలి రండి’ అంటూ ప్రముఖులకు ప్రజా ప్రభుత్వం ఆహ్వానాలు

 

హైదరాబాద్, మహా: ‘తరలి రండి- ఉజ్జ్వల తెలంగాణలో పాలుపంచుకొండి’ అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవనున్నారు. వివిధ రంగాల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఆహ్వన లేఖలను పంపిస్తోంది.

 

దాదాపు 3 వేల ప్రముఖులతో సమ్మిట్..

సీఎం ఆహ్వాన లేఖల్లో, ‘వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఈ లక్ష్యాలను.. మా ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ను నిర్వహిస్తున్నాము. తప్పకుండా తరలిరండి..’ అనే ఆహ్వాన సందేశంతో పంపించారు. ప్రభుత్వం పంపించిన ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో కొందరు సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ ఖాసిమీ, రాస్ అల్ ఖైమా, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్స్టన్, మాండల్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెనెట్ నియో తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. తెలంగాణ ప్రగతి సంక్షేమాన్ని, అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్‌ దిశగా తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటిచెప్పాలని సంకల్పించింది.

 

మెస్సీ కిక్‌తో ముగింపు..

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. మెస్సీ కిక్‌తో ఈ వేడుకను ముగించాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు’ ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలుస్తుంది.

Latest