- కాళోజీ వర్సిటీ వీసీ రాజీనామా
- ఆరోపణల దృష్ట్యా డా. నందకుమార్ రిజైన్
- నిధులను దుర్వినియోగం చేశారనే తదితర ఆరోపణలు
హైదరాబాద్, మహా: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) డా. నందకుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వీసీ పదవికి రాజీనామా చేశారు. వర్సిటీ వ్యవహారాలకు సంబంధించి ఇటీవల ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. మూల్యాంకనంలో అక్రమాలు, ఇష్టారీతిగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం, విశ్వవిద్యాలయ నిధులను దుర్వినియోగం చేశారనే తదితర ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల ద్వారా ఆరా తీశారు. ఈ క్రమంలో డా. నందకుమార్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఆరోపణల తీవ్రత దృష్ట్యా..
డా. నందకుమార్ రాజీనామా పత్రాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదించినట్లు సమాచారం. నూతన వీసీ నియామకం జరిగే వరకు ప్రస్తుత రిజిస్ట్రార్ లేదా వైద్య విద్య సంచాలకులు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై అంతర్గత విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వెంటనే రాజీనామా చేయాల్సిందిగా వీసీకి సూచించినట్లు తెలుస్తోంది. కాళోజీ వర్సిటీకి సంబంధించిన తదుపరి పరిణామాలు, కొత్త వీసీ నియామక ప్రక్రియపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.







