గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ.
* సిద్ధాంతాలకు తిలోదకాలు.. గెలుపే బంధువు!
* పగలు పార్టీల ఫైటింగ్.. రాత్రిపూట సీట్ల సెట్టింగ్!
* జెండా పక్కన పెట్టి.. అజెండా మార్చేశారు.
* సంప్రదింపులు.. బుజ్జగింపులు.. సెటిల్మెంట్లు.
* గ్రామాల్లో నయా దందా!
ఖమ్మం బ్యూరో, మహా.
*తెలంగాణ పల్లెల్లో ప్రస్తుతం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సిద్ధాంతాలు, పార్టీ జెండాలు, నాయకుల పిలుపులే శిరోధార్యంగా ఉండే గ్రామ రాజకీయాలు.. నేడు పూర్తిగా వ్యాపారమయంగా, అవసరార్థ రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే బద్ధ శత్రువులైన పార్టీలు, గ్రామ పొలిమేరల్లోకి వచ్చేసరికి మిత్రులుగా మారిపోతున్నారు. “నువ్వా నేనా” అంటూ అసెంబ్లీ వేదికగా సవాళ్లు విసురుకునే పార్టీల క్యాడర్, గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో మాత్రం “నువ్వు సర్పంచ్.. నేను ఉప సర్పంచ్” అంటూ వాటాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలంలో ప్రజాస్వామ్య విలువల కంటే.. తెరచాటు ఒప్పందాలు, చీకటి సెటిల్మెంట్లదే పైచేయిగా మారింది*
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో పల్లె రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన పోకడలు, అనూహ్యమైన పొత్తులు తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారం కోసం హోరాహోరీగా తలపడే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు.. క్షేత్రస్థాయిలో మాత్రం తమ స్వలాభం కోసం సిద్ధాంతాలను పాతరేశాయి. గ్రామాల్లో తమ పట్టు నిలుపుకోవడమే ఏకైక లక్ష్యంగా నాయకులు విచక్షణా రహితంగా పొత్తులకు తెరలేపారు. కొన్ని చోట్ల కాంగ్రెస్-బీజేపీ కలిసి పోటీ చేస్తుంటే, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్-కాంగ్రెస్, ఇంకొన్ని చోట్ల కమ్యూనిస్టులు-బీజేపీ ఇలా.. ఏ పార్టీ ఎవరితో కలసి నడుస్తుందో సామాన్య ఓటరుకు అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. కేవలం ప్రత్యర్థి వర్గాన్ని ఓడించడమే లక్ష్యంగా, నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నవారు నేడు మిత్రులుగా మారి నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో “అడ్జస్ట్‌మెంట్ పాలిటిక్స్” తారాస్థాయికి చేరాయి. గ్రామ సర్పంచ్ పీఠం ఒక పార్టీకి దక్కితే, ఉప సర్పంచ్ పదవిని మరో పార్టీకి, వార్డు మెంబర్లను ఇంకో వర్గానికి పంచుకుంటూ ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకోవాలన్న కనీస స్పృహ లేకుండా, నాయకులే కూర్చుని పదవులను పంపకాలు చేసుకోవడం గమనార్హం. ఎన్నికల బరిలో ప్రత్యర్థులు ఎవరూ లేకుండా చూసుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. నామినేషన్ వేయడానికి సిద్ధమైన ఇతర అభ్యర్థులను మొదట సంప్రదింపుల పేరుతో పిలిపించి, ఆపై బుజ్జగింపులతో మెత్తబరిచి, అప్పటికీ వినకపోతే బెదిరింపులు లేదా భారీ ఎత్తున నగదు ఎరగా చూపి “సెటిల్మెంట్లు” చేస్తున్నారు. ఈ తతంగమంతా బహిరంగ రహస్యంగానే సాగుతోంది.
మరో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఆర్థిక బలం లేని పార్టీలతో లేదా బలహీనంగా ఉన్న వర్గాలతో ప్రధాన పార్టీల నాయకులు రూపాయి తరహాలో ప్యాకేజీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. చాటుమాటుగా జరిగే ఈ ఒప్పందాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు ఇంత రేటు, పోటీ నుంచి తప్పుకుంటే ఇంత ప్యాకేజీ అంటూ బహిరంగంగానే బేరసారాలు సాగుతున్నాయి. ప్రజాసేవ కోసం కాకుండా, పదవిని అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో సంపాదించుకోవచ్చన్న దురాశతోనే ఈ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా సాగుతున్న ఈ అనైతిక పొత్తుల పర్వంలో నిజమైన కార్యకర్తలు, పార్టీనే నమ్ముకున్న సామాన్యులు అయోమయానికి గురవుతున్నారు.
అయితే, ఈ “సెటిల్మెంట్” రాజకీయాలు అన్ని చోట్లా సజావుగా సాగడం లేదు. కొన్ని గ్రామాల్లో బలమైన నాయకులను, లేదా పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి పొత్తుల పేరుతో టిక్కెట్లు నిరాకరించడంతో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమను సంప్రదించకుండానే ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేని రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి పోటీకి సై అంటున్నారు. “మాకు అన్యాయం జరిగింది, బరిలో దిగి తేల్చుకుంటాం” అంటూ అధిష్టానాల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటి వారిని బుజ్జగించడానికి రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగినా ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. మొత్తానికి ఈ స్థానిక ఎన్నికలు సిద్ధాంతాలకు, స్వార్థానికి మధ్య జరుగుతున్న పోరాటంగా మారాయి. ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి అనైతిక పొత్తులు, ధన ప్రవాహం, బలవంతపు ఏకగ్రీవాలు భవిష్యత్ రాజకీయాలకు ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.







