Mahaa Daily Exclusive

  కేసీఆర్ దీక్షపై మంత్రి సీతక్క ఫైర్: నిమ్మరసానికి తెలుసు ఆ సంగతి!

Share

  • కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు
  • బీఆర్ఎస్ ‘దీక్ష దివస్’పై మంత్రి సీతక్క ఫైర్
  • అధికారంలో ఉన్న‌ప్పుడు ఒకే ఒక్క‌ రోజు..ఇప్పుడు 10 రోజులా అని నిలదీత

హైద‌రాబాద్, మహా : దీక్ష దివస్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసే డ్రామాలు చేస్తుందని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజే నిర్వహించిన దీక్ష దివస్‌ను, ఇప్పుడు అధికారం పోయాక పది రోజుల పాటు నిర్వహించడం వెన‌క ఆంత‌ర్యం ఏంట‌ని ప్రశ్నించారు. అధికార పార్టీని దూషించడం కోసమే దీక్ష దివ‌స్ నిర్వ‌హిస్తున్నారా అని నిల‌దీశారు. కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు అని ఎద్దేవ చేశారు.

కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్‌తో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు సంబంధించి నమోదైన కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన అనంతరం, మీడియా ప్రశ్నలకు మంత్రి సీతక్క స‌మాధాన‌మిచ్చారు. ప్రజా ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తైందని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎన్నో పనులు ప్రజల్లో నమ్మకాన్నిపెంచాయన్నారు. “బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై మా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ తప్పుడు ప్రచారం చేస్తోంది. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయినా వారి బుద్ధి మారలేదు” అని ఆమె విమర్శించారు.

సోష‌ల్ మీడియాను సేవా వేదికగా ఉపయోగించాల్సిన చోట బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి వాడుకుంటోందని, మీడియా అనే ఫోర్త్ ఎస్టేట్‌ను బీఆర్ఎస్ సొంత ఎస్టేట్‌లా మార్చుకుని విషం చిమ్ముతుందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోగానే ఫామ్‌హౌస్‌ల్లో ఉండే నేతలు ప్రజానాయకులు కాలేరని సీతక్క వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ దయతో ఏర్పడిన తెలంగాణలో బీఆర్ఎస్ అన్ని వర్గాలను వంచించిందని, యువతకు ఉద్యోగాలు లేక రైతులు అప్పుల బాధలో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొల్పిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఆడబిడ్డల పొదుపు అయిన రూ.1500 కోట్ల అభయహస్తం నిధులను దోచుకున్నారని, రూ.3000 కోట్ల వడ్డీలను కూడా బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు మంజూరు చేయడం, 74 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేయడం, నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ, ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సన్న వరి బియ్యం బోనస్ వంటి ఎన్నో కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్థానిక ఎన్నికలను రెండు సంవత్సరాలు వాయిదా వేయాల్సి వచ్చిందని, 15వ ఆర్థిక సంఘం నిధులైన రూ.3000 కోట్లు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. మార్చి 31, 2026లో ఆర్థిక సంఘం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఎన్నికలు జరపకపోతే రాష్ట్రానికి నష్టం తప్పదని పేర్కొన్నారు.

రిజర్వేషన్ పెంపుకోసం అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, కానీ బీజేపీ–బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. కులగణనలో బీఆర్ఎస్ పెద్దలు పాల్గొనకపోవడం దీనికి నిదర్శనం అని చెప్పారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే బీజేపీ నాయకులు, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం దొంగ దీక్షలు చేస్తుండటం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్ పెంపు బిల్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉంది. నిజంగా ప్ర‌ధాని మోదీ బీసీ అయితే వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కేంద్రం ఆలస్యం చేస్తున్నందున, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిస్తామని ఆమె ప్రకటించారు.

Latest