- స్లీపర్ బస్సులను ఆపండి
- ప్రైవేట్ ట్రావెల్స్ కు ఎన్ హెచ్ఆర్ సీ షాక్
- రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులలో చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు, బస్సులలో ప్రజల భద్రతపైన ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. స్లీపర్ బస్సుల విషయంలో మార్గదర్శకాలను పంపింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడం, ఎమర్జెన్సీ డోర్స్ ను మూసివేయడం, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వంటి అనేక కారణాలతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు, ఘోరంగా ప్రాణనష్టం జరిగినట్లు ఇటీవల నివేదికలు పేర్కొన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇతర బస్సు ప్రమాదాలు, సౌదీ అరేబియాలో జరిగిన దారుణ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలను జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థల పైన సంయమనంతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ బస్సులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులను నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు తాజాగా ఇటీవల జరిగిన ఘటన అధికారులు తరచూ బస్సులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు షాక్ అనే చెప్పాలి.
అందుకే ప్రమాదాలు
ప్రస్తుతం నడుస్తున్న బస్సులలో 50 శాతానికి పైగా స్లీపర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులలో లోపల భాగం ఇరుగ్గా ఉండడం, ప్రయాణికులు బయటకు త్వరగా రాలేకపోవడం, అగ్ని ప్రమాదాలను నియంత్రించే రక్షణ వ్యవస్థ లేకపోవడం వంటివి కారణమవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్లీపర్ బస్సులు విషయంలో కీలక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది.







