దటీజ్ రేవంత్..
* రాజకీయ చదరంగంలో తిరుగులేని ‘రాజ ముద్ర’!
* ప్రతిపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయ..
* రేవంత్ ‘సైలెంట్’ ఆపరేషన్ సక్సెస్!
* బీసీ నినాదం బేజారు.. ‘చిత్ర’వధే రేవంత్ రెడ్డి ఆయుధం!
* అంచనాలు తలకిందులు.. విపక్షాల ఉనికికే ఎసరు పెట్టిన ‘హస్తం’ వ్యూహం!
* క్షేత్రస్థాయిలో కొత్త లెక్కలు.. రేవంత్ మార్కు పాలిటిక్స్ ముందు అంతా బలాదూర్!
* రిజర్వేషన్ల గండం నుంచి గెలుపు తీరానికి.. ఇది కదా ‘మాస్టర్’ స్ట్రోక్ అంటే!
హైదరాబాద్,మహా.
*రాజకీయాల్లో సంక్షోభం వచ్చినప్పుడు కుంగిపోవడం సామాన్య లక్షణం, కానీ ఆ సంక్షోభాన్ని ఒక సువర్ణావకాశంగా మలుచుకుని, తన వైఫల్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రత్యర్థులనే ఆత్మరక్షణలో పడేయడం అసామాన్య నాయకత్వ లక్షణం. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా అదే చేసి చూపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారుతుందని, ఇదే అదనుగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడతాయని రాజకీయ పండితులు మొదలుకొని సామాన్యుల వరకు అంతా ఊహించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కోర్టు తీర్పును గౌరవిస్తూనే రేవంత్ రెడ్డి అమలు చేసిన ఒక అదృశ్య వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలని చూసిన ప్రతిపక్షాలకు.. ఆ నినాదం ఎత్తడానికి వీల్లేకుండా కట్టుదిట్టం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ‘మాస్టర్ మైండ్’ దే*
తెలంగాణ రాజకీయ యవనికపై రేవంత్ రెడ్డి అనే పేరు ఒక ప్రభంజనం అని మరోసారి రుజువైంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని తేలిపోవడంతో, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. సహజంగానే ఇది ప్రతిపక్షాలకు ఒక వరంలా కనిపించింది. బీఆర్ఎస్, బీజేపీలు ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ద్రోహి అని ముద్ర వేయడానికి సిద్ధమయ్యాయి. జిల్లాల వారీగా ధర్నాలు, రాస్తారోకోలతో రేవంత్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టాలని స్కెచ్ వేశాయి. కానీ, రేవంత్ రెడ్డి ఆలోచనలు ఆషామాషీగా ఉండవని వారికి ఆలస్యంగా తెలిసొచ్చింది. తాను ఒక అడుగు వెనక్కి వేసింది భయంతో కాదు, పదింతల వేగంతో ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికని రేవంత్ తన వ్యూహంతో నిరూపించారు.
ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం ‘క్షేత్రస్థాయి స్వేచ్ఛ’. రాష్ట్ర స్థాయిలో పార్టీల మధ్య వైరం ఉన్నప్పటికీ, గ్రామ స్థాయిలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిస్తూ, పొత్తుల విషయంలో స్థానిక నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ఒక సంచలన నిర్ణయం. దీని ఫలితమే ఈరోజు మనం చూస్తున్న విచిత్ర రాజకీయ దృశ్యం. రాష్ట్రంలో బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్-బీఆర్ఎస్, కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు, కొన్నిచోట్ల ఏకంగా కాంగ్రెస్-బీజేపిలు కూడా స్థానిక అవసరాల రీత్యా చేతులు కలిపాయి. ఎప్పుడైతే ఈ విచిత్రమైన కలయికలు మొదలయ్యాయో, అప్పుడే ప్రతిపక్షాల వ్యూహానికి గండి పడింది. తమ పార్టీ జెండా మోసే కింది స్థాయి కార్యకర్తలే కాంగ్రెస్ తో కలిసి నామినేషన్లు వేస్తుంటే, ఇక రాష్ట్ర నాయకత్వం ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ ను విమర్శిస్తుంది?
ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డిపై దాడి చేయాలనుకున్న విపక్షాల పాచికలు పారలేదు. ఎందుకంటే, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నది తమ సొంత పార్టీ వాళ్లే అయినప్పుడు, విమర్శలు చేస్తే అది సొంత కళ్ళను పొడుచుకున్నట్టే అవుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఎక్కడా బీసీ నినాదం గట్టిగా వినిపించడం లేదు. ఒకవేళ కేసీఆర్ గానీ, బండి సంజయ్ గానీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడితే, అది పరోక్షంగా వారి పార్టీ క్యాడర్ చేసుకున్న ఒప్పందాలను తప్పుబట్టినట్టే. ఇలా విపక్షాలను ‘లాక్’ చేసి, వారు కనీసం నోరు మెదపలేని పరిస్థితిని కల్పించడం రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతికి నిదర్శనం. ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని, “నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది” అని రేవంత్ రెడ్డి పరోక్ష హెచ్చరిక జారీ చేసినట్లయింది.
ఈ పరిణామాలను గమనిస్తే, రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ప్రజల నాడి తెలిసిన మాస్ లీడర్ అని అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల్లో సిద్ధాంతాల కంటే వ్యక్తిగత సంబంధాలు, గెలుపు సమీకరణాలే ముఖ్యమని గుర్తించిన ఆయన, ఆ దిశగానే పావులు కదిపారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెరగడమే కాకుండా, భవిష్యత్తులోనూ స్థానిక సంస్థలపై పట్టు సాధించే అవకాశం దక్కింది. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంతటి క్లిష్టమైన సమస్యను ఇంత చాకచక్యంగా పరిష్కరించడం, ప్రతిపక్షాలు కనీసం విమర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేయడం నిజంగా అద్భుతం. ఈ ‘పొలిటికల్ మాస్టర్ పీస్’ గేమ్ తో రేవంత్ రెడ్డి తన రాజకీయ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించుకున్నారని, రాబోయే రోజుల్లో ఆయన్ను ఢీకొట్టడం ప్రతిపక్షాలకు అంత తేలిక కాదని స్పష్టమవుతోంది.







