Mahaa Daily Exclusive

  అమరావతిపై సీఎం బ్లాక్ మెయిల్:ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Share

  • 54 వేల ఎకరాల సంగతి ఏంటి?
  • అమరావతిపై సీఎం బ్లాక్ మెయిల్
  • రాజధానిపై శ్వేతపత్రం రిలీజ్ చేయండి
  • చంద్రబాబు తీరు ‘మీసాలకు సంపంగి నూనె’లా ఉంది
  •  ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్

అమరావతి, మహా: రాష్ట్రంలో అభివృద్ధికి డబ్బులు లేకపోయినా, రాజధాని పేరుతో కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం “మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె” అన్న చందంగా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా విమర్శించారు. రాజధాని పేరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా, లూటీ జరుగుతోందని ఆరోపించారు. తొలి విడతలో 25 గ్రామాల నుంచి 29 వేల మంది రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 54 వేల ఎకరాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. 11 ఏళ్లయినా అమరావతికి రూపు లేదని, 217 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని, ఒక్క ఆకాశహర్మ్యం కూడా కట్టలేదని ఆమె విమర్శించారు. 54 వేల ఎకరాలపై సరైన లెక్క చెప్పకుండా, రెండో విడతలో 16 వేల నుంచి 44 వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రెండో విడత భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం అని ఆమె స్పష్టం చేశారు.

రెండో విడతలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, 2500 ఎకరాల్లో స్పోర్ట్ సిటీ కట్టడంపై షర్మిలా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబై ఛత్రపతి విమానాశ్రయం కేవలం 1850 ఎకరాలు, ఒలింపిక్స్ నిర్వహించిన బీజింగ్, లండన్‌లలోని స్పోర్ట్ హబ్‌లు 150 ఎకరాలు మాత్రమే ఉన్నప్పుడు అమరావతికి ఇంత భారీ భూమి ఎందుకని ప్రశ్నించారు. రెండో విడత భూములు ఇవ్వకపోతే రాజధాని నిర్మాణం జరగదని, రైతుల భూములకు విలువ ఉండదని చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీ, మోదీల కోసమే ఈ రెండో విడత భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాజధాని పేరుతో తెచ్చిన రూ. 58 వేల కోట్ల అప్పులు తీర్చలేనివని, రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అయినప్పుడు ఇన్ని అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తొలి విడత భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులకు అన్యాయం జరిగిందని, వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదని అన్నారు. రైతులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని, వెంటనే తొలి విడత భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం అని, ఆ పేరుతో మోసం చేయవద్దని ఆమె హితవు పలికారు.

Latest