Mahaa Daily Exclusive

  మంటలు రేపుతున్న ‘ఐబొమ్మ’ రవి అంశం.

Share

మంటలు రేపుతున్న ‘ఐబొమ్మ’ రవి అంశం.
• నేనూ ఐబొమ్మలో చూశాను.
• సినిమా మాఫియాకు ఉరిశిక్ష వేయండి.
• రవి ఒక యోధుడు, ఎన్‌కౌంటర్ చేస్తే వంద మంది పుడతారు!’
• కోట్లు ఖర్చు పెట్టి అడుక్కుంటున్న సినీ పరిశ్రమ.
* భగ్గుమన్న సీపీఐ నారాయణ: ‘

హైదరాబాద్, మహా.

తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక రంగంలో ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐబొమ్మ రవి అరెస్టు, మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లను ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వాలు, వ్యవస్థల వైఫల్యాలపై చేసిన విమర్శలు అగ్గి రాజేశాయి.తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత నారాయణ, ఇటీవల అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి, ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు హిడ్మా ఉదంతాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు, వ్యవస్థల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ధరల మాఫియా పేరుతో ప్రజలను దోచుకుంటున్న సినీ పరిశ్రమను ఉద్దేశించి, ‘ఉరి తీయాల్సింది ఐబొమ్మ రవిని కాదు, ఈ సినీ మాఫియాను ఉరి తీయండి, ఎన్‌కౌంటర్ చేయండి’ అంటూ ఆయన సంచలన డిమాండ్ చేశారు. ‘ఐబొమ్మ రవి లాంటి తెలివిగలవాడు, హిడ్మా లాంటి పోరాట యోధుడు ఈ వ్యవస్థల దోపిడీకి, మాఫియాకి వ్యతిరేకంగా, ప్రజలకు మేలు చేయాలనే తిరగబడ్డ యోధులు’ అని ఆయన అభివర్ణించడం తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి సినిమా టికెట్ రేట్లకు బయపడి తాను కూడా ఐబొమ్మలోనే సినిమాలు చూసేవాడినని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఒక వ్యక్తిని అడ్డుకుంటే సమస్య తీరదని, దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాటు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఈరోజు మీరు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే, ఎన్‌కౌంటర్ చేస్తే వంద మంది రవి లాంటివాళ్ళు పుడతారు. ఒక హిడ్మాను చంపి సంబర పడిపోతున్నారేమో, వెయ్యిమంది హిడ్మాలు పుడతారు. దోపిడీ ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది,’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వ్యవస్థల్లో లోపాలు, డొల్లతనం ఇలాగే ఉంటే హిడ్మా రూపంలోనో, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళ రూపంలోనో తిరుగుబాటు రాక తప్పదని, ‘సివిల్ వార్ రాక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. వ్యవస్థలు వ్యక్తుల చేతుల్లో బందీలై, దేశ వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే ఇలాంటి తిరుగుబాట్లు అనివార్యమని ఆయన విశ్లేషించారు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి టికెట్ రేట్లు పెంచుకుంటామని సినిమా వాళ్ళు ప్రజల దగ్గర అడుక్కు తింటున్నారని, ప్రభుత్వాలు సిగ్గులేకుండా మద్దతు ఇవ్వడం సరికాదని సీపీఐ నారాయణ మండిపడ్డారు.

Latest