- హుస్నాబాద్‌ను తెలంగాణ కోనసీమగా చేస్తాం
- రింగురోడ్డు, కబడ్డీ అకాడమీ, స్టేడియం, పార్కులు
- మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
హుస్నాబాద్, మహా: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా, ఉత్తర తెలంగాణ కోనసీమగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో సభా స్థలిని పరిశీలించిన మంత్రి పొన్నం.. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా.. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు బస్సులు ఇస్తాం. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నాం. హైదరాబాద్ నుంచి హుస్నాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభిస్తాం. హుస్నాబాద్‌లో రింగురోడ్డు, కబడ్డీ అకాడమీ, తాగునీటి సౌకర్యం, స్టేడియం అభివృద్ధి, డిగ్రీ కాలేజీ సమీపంలోని స్థలంలో పార్క్, మార్కెట్‌యార్డ్, కాటన్ మార్కెట్ అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సీఎంను కోరనున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి’’అని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.
===============







