షాపూర్‌నగర్ దారుణం..!
* నర్సరీ చిన్నారిపై ‘ఆయా’ పైశాచిక దాడి.
* కాలుతో తొక్కిన వైనం.
* యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం.
* ‘చిన్న ఇష్యూ’ అన్న స్కూల్ యాజమాన్యం..
హైదరాబాద్ , మహా.
హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ ప్రాంతంలో ఉన్న పూర్ణిమా స్కూల్‌లో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై జరిగిన పైశాచిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మనుషులు అనేవారు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా అనిపించే విధంగా, అదే స్కూల్‌లో పనిచేస్తున్న ఆయా.. ఆ పసిబిడ్డను కింద పడేసి కాలుతో తొక్కి, అమానవీయంగా దాడి చేసింది. ఈ దారుణ దృశ్యాలు పక్క బిల్డింగ్ నుంచి రికార్డు కావడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. శత్రుత్వం ఉన్నవారు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరేమో అనిపించేలా జరిగిన ఈ ఘటన, ఆ చిన్నారి తల్లిదండ్రులను, సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఒడిశా రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి, కూలి పనులు చేసుకుంటున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఆ చిన్నారి తల్లి కూడా అదే పూర్ణిమా స్కూల్‌లో ఆయాగా పనిచేస్తోంది. పిల్లలను దించడానికి ఆమె బస్సులో వెళ్లిన సమయంలోనే, మరో ఆయా ఈ కిరాతక దాడికి పాల్పడింది. అత్యంత దారుణంగా, ఆ పసిబిడ్డను కింద పడేసి, కాళ్లతో తొక్కిన దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం చివుక్కుమంది. ఆ చిన్నారిని కొడుతున్న దృశ్యాలను పక్క భవనం నుంచి ఒక యువకుడు తన ఫోన్‌లో రికార్డు చేయడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
దాడి జరిగిన తర్వాత నుంచి ఆ చిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా, వారు మరింత నిర్లక్ష్యంగా స్పందించారు. “చిన్న ఇష్యూని ఎందుకు సాగదీస్తున్నావు” అంటూ ఆ తల్లిని ప్రశ్నించడం యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేసింది. దీంతో చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పసిబిడ్డపై దాడికి పాల్పడిన ఆ ఆయాపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఇంతటి దారుణాన్ని ‘చిన్న విషయం’ అంటూ నిర్లక్ష్యం చేసిన స్కూల్ యాజమాన్యంపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పాఠశాలల్లో పిల్లల భద్రతకు సంబంధించిన లోపాలను ఎత్తిచూపుతూ, సమాజంలో భయాన్ని పెంచుతోంది.








